పావలా కోడికి, అర్ధ రూపాయి మసాలా.. పాక్‌లో ఇదో వింత..
అసలు విరాళాల సేకరణ చేపట్టింది డ్యామ్ నిర్మాణం కోసం కాదని, కేవలం ప్రజల్లో అవగాహన పెంచేందుకేనని చెప్పారు పాకిస్తాన్ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్. దీంతో ఈ డ్యామ్ మరోసారి వార్తల్లోకెక్కింది.
పాకిస్తాన్‌లో సింధు నదిపై డయామర్ భాషా అనే డ్యామ్ నిర్మించడానికి ప్రజల నుంచి ప్రభుత్వం విరాళాలు సేకరించింది. చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులిచ్చారు. సైన్యం కూడా తమ జీతంలో కొంత డొనేట్ చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా ఈ డ్యామ్ నిర్మాణానికి తనవంతు సాయం చేసింది. డ్యామ్ ఇంకా పూర్తి కాలేదు. గతంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సాకిబ్ నిసార్ ఈ విరాళాల పని మొదలుపెట్టారు. ఇటీవల ఆయన పదవీ విరమణ సందర్భంగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. అసలు విరాళాల సేకరణ చేపట్టింది డ్యామ్ నిర్మాణం కోసం కాదని, కేవలం ప్రజల్లో అవగాహన పెంచేందుకేనని చెప్పారు. దీంతో ఈ డ్యామ్ మరోసారి వార్తల్లోకెక్కింది.
పాకిస్తాన్‌లో సింధు నదిపై డయామర్ భాషా డ్యామ్ నిర్మాణాన్ని 2018లో మొదలుపెట్టారు. అప్పటి చీఫ్ జెస్టిస్ సాకిబ్ నిసార్ విరాళాల సేకరణ మొదలుపెట్టడంతో ప్రముఖులంతా ఆయన్ను అనుసరించారు. భారీగా విరాళాలిచ్చారు. ఇటీవల వరదలతో పాక్ అతలాకుతలం అవుతున్న సందర్భంలో ఈ డ్యామ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. విరాళాలు సేకరించినా ఇంకా డ్యామ్ పూర్తి కాకపోవడానికి కారణం ఏంటా అని ఆరాతీశారు. అసలు విషయం బయటపడింది. డయామర్ భాషా డ్యామ్ కోసం ఇప్పటి వరకు 40 మిలియన్ డాలర్లు ప్రజల నుంచి సేకరించారు. అయితే ఈ డ్యామ్ ప్రచారం కోసం ఇప్పటి వరకు 63 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. అంటే ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తం ప్రచారానికే ఖర్చు చేయడం విశేషం. అయినా డ్యామ్ ఇంకా పూర్తి కాలేదు, అది మరో విశేషం.
పాకిస్తాన్ పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ లెక్కల ప్రకారం ఈ డ్యామ్ పూర్తి కావాలంటే ఇంకా నిధులు కావాలి. కానీ ఇప్పుడు ఆ నిధుల్ని ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంటుంది. ప్రజల నుంచి సేకరించే నిధులతో పని పూర్తి కాదని తమకు తెలుసని, కానీ నిధులు సేకరించడానికి ప్రధాన ఉద్దేశం డ్యామ్ నిర్మించడం కాదని అంటున్నారు సాకిబ్ నిసార్. ఆ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మాటలు ఇప్పుడు పాక్‌లో సంచలనంగా మారాయి. ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ప్రజా ధనాన్ని ప్రచారానికి వృథా చేశారంటూ మండిపడుతున్నారు విపక్ష నేతలు.