ఎయిర్ ఆసియాకు 20లక్షలు జరిమానా.. ఎందుకంటే..?
విధి నిర్వహణలో విఫలమైనందుకు ఎయిర్ ఆసియా హెడ్ ట్రైనీని మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఆసియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్ లకు ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమానా విధించింది.
ఇటీవల కాలంలో విమానాయాన సంస్థలు పదే పదే తప్పులు చేస్తూ దొరికిపోతున్నాయి. కొన్నిసార్లు ప్రయాణికుల్ని మరచిపోవడం, మరికొన్నిసార్లు వారి లగేజీని మరచిపోవడం, ఇంకొన్నిసార్లు షెడ్యూల్ టైమ్ మార్చేయడం ఇలా.. రకరకాలుగా వార్తల్లోకెక్కుతున్నాయి భారత విమానయాన సంస్థలు. ఆమధ్య ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన ఘటన మరీ ఘోరం. ఆ తర్వాత ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఎయిర్ ఆసియా సంస్థకు కూడా డీజీసీఏ 20లక్షల రూపాయల జరిమానా విధించింది. పైలట్ల ట్రైనింగ్ విషయంలో రాజీ పడినందుకే ఈ జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది.
ఎయిర్ ఆసియాకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్ ఆసియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.20లక్షల జరిమానా విధించింది. ట్రైనింగ్ సమయంలో పైలట్ల నెపుణ్యానికి సంబంధించిన టెస్ట్, ఇన్ స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా విమానయాన సంస్థలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎయిర్ ఆసియా అలా తనిఖీలు చేయడం లేదని తేలింది. దీన్ని నిర్ధారించుకున్న డీజీసీఏ జరిమానాతో తొలి హెచ్చరిక జారీ చేసింది.
విధి నిర్వహణలో విఫలమైనందుకు ఎయిర్ ఆసియా హెడ్ ట్రైనీని మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఆసియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్ లకు ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ఎయిర్ ఆసియా సంస్థ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ కోరుతూ ఇటీవలే ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది డీజీసీఏ. షోకాజ్ నోటీసులకు వివరణ వచ్చిన తర్వాత తాజాగా జరిమానాలు విధిస్తూ చర్యలు తీసుకుంది.