Telugu Global
National

కశ్మీర్ లో రక్తపాతం తప్పదన్నవారికి అభివృద్ధే సమాధానం.. అమిత్ షా

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ- కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్లో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పెంచామని, మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని చెప్పారు.

కశ్మీర్ లో రక్తపాతం తప్పదన్నవారికి  అభివృద్ధే సమాధానం.. అమిత్ షా
X

కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తే రక్తపాతం జరుగుతుందని ఎంతోమంది భయపెట్టారని.. అలా మాట్లాడిన వారికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధే సమాధానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కశ్మీర్లో కొన్నేళ్ల కిందటి వరకు ఆర్టికల్ 370 అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాజ్యాలు, సంస్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత రాజ్యాలు, సంస్థానాలను దేశంలో విలీనం చేశారు.

కానీ జమ్మూ -కశ్మీర్ రాజు హరి సింగ్ కొన్ని షరతులతో భారత్ లో విలీనం అయ్యేందుకు సమ్మతించారు. ఆ మేరకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనలు తీసుకువచ్చారు. దీనికి ప్రకారం జమ్మూ -కశ్మీరుకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. కాగా 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జమ్మూ- కశ్మీర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రాజౌరిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో నాయకులు, కార్యకర్తలు మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేయగా.. కశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేస్తే రక్తపాతం తప్పదని భయపెట్టిన వారికి ఈ నినాదాలు, ఇక్కడ జరిగిన అభివృద్ధే సమాధానమని వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ- కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్లో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పెంచామని, మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని చెప్పారు. కొత్తగా 100కు పైగా పాఠశాలలు తీసుకువచ్చామని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

జమ్మూ -కశ్మీర్ లో ప్రత్యేకంగా జాతీయ రహదారుల అభివృద్ధి కోసం లక్ష కోట్లు మంజూరు చేసినట్లు అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే ఈ అభివృద్ధి సాధ్యమైందని అమిత్ స్పష్టం చేశారు. కశ్మీర్ ను 70 ఏళ్ల పాటు మూడు కుటుంబాలే పాలించాయని, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ కుటుంబాలకే పరిమితం చేశాయని ఆయన విమర్శించారు.

First Published:  4 Oct 2022 4:38 PM IST
Next Story