Telugu Global
National

నిషేధమన్నారు.. శిక్ష అన్నారు.. అయినా మోత మోగిన ఢిల్లీ

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు మాత్రం లెక్క చేయలేదు. వ్యాపారులు ఎటువంటి భయం లేకుండా టపాసులు విక్రయించగా..జనం కూడా ఎగబడి కొన్నారు. రాత్రి 11 గంట‌ల‌ దాకా ఢిల్లీలో టపాసుల మోత మోగించారు.

నిషేధమన్నారు.. శిక్ష అన్నారు.. అయినా మోత మోగిన ఢిల్లీ
X

ఢిల్లీలో కొన్నేళ్లుగా వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇక శీతాకాలం వచ్చిందంటే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. దీపావళి సమయంలో టపాసులు కాల్చడానికి కూడా నిషేధించింది. దీపావళి సమయంలో నిషేధం విధించడం ఢిల్లీలో ఇది వరుసగా మూడోసారి. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు.

నిన్న దీపావళి సందర్భంగా ఢిల్లీ మోత మోగిపోయింది. ప్రజలందరూ నిషేధాన్ని లెక్కచేయకుండా టపాసులు భారీగా పేల్చారు. దీపావళి రోజు బాణాసంచా కాల్చితే రూ.200 జరిమానా విధించడంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. టపాసులు నిల్వ ఉంచేవారికి, విక్రయించే వారికి రూ.5 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. పండగ రోజు ఎక్కడా బాణాసంచా పేల్చకుండా ప్రభుత్వం 408 నిఘా బృందాలను కూడా ఏర్పాటు చేసింది.

అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు మాత్రం లెక్క చేయలేదు. వ్యాపారులు ఎటువంటి భయం లేకుండా టపాసులు విక్రయించగా..జనం కూడా ఎగబడి కొన్నారు. రాత్రి 11 గంట‌ల‌ దాకా ఢిల్లీలో టపాసుల మోత మోగించారు. నేల మీద పేలే టపాసులతోపాటు ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్లను కూడా ప్రజలు భారీగా కాల్చారు. ఫలితంగా ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత మరింత క్షీణించింది.

First Published:  25 Oct 2022 11:24 AM IST
Next Story