మూడు ఎకరాల పోలీస్ ల్యాండ్‌ను అమ్మేసిన డిప్యూటీ సీఎం
మేడమ్ కమిషనర్ అనే పుస్తకంలో ఇలాంటి అనేక వివాదాస్పద ఘటనలను ఆమె రాసుకొచ్చారు.
పోలీస్ ల్యాండ్‌పై కన్నేసిన ఓ జిల్లా మంత్రి.. ఎవరికీ అనుమానం రాకుండా వేలం వేసి సొమ్ము చేసుకున్నారు. ఆ ల్యాండ్‌ను అప్పగించడానికి అప్పటి పోలీస్ కమిషనర్ నిరాకరించారు. అదొక వివాదంగా మారింది. ఈ సంఘటన జరిగిన 13 ఏళ్ల తర్వాత సదరు కమిషనర్ దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అప్పటి ఆ జిల్లా మంత్రే నేడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్. ఆనాటి పోలీస్ కమిషనర్ మీరన్ చద్దా బోర్వాంకర్ తాజాగా రాసిన 'మేడమ్ కమిషనర్' అనే పుస్తకంలో వీటి వివరాలను వెల్లడించారు. పాన్ మెక్‌మిలన్ అనే పబ్లిషింగ్ సంస్థ ఈ పుస్తకాన్ని ఆదివారం మార్కెట్లోకి విడుదల చేయనున్నది.
2010లో పూణేలోని ఎరవాడ ప్రాంతంలో ఉన్న 3 ఎకరాల పోలీస్ ల్యాండ్‌ను అప్పటి జిల్లా మంత్రి అజిత్ పవార్ ఆదేశాలతో వేలం వేసినట్లు ఆమె పుస్తకంలో పేర్కొన్నారు. పోలీస్ కార్యాలయాలు, గృహ అవసరాలకు వినియోగించాలనే కారణంతో ఆ ల్యాండ్‌ను అప్పగించడానికి తాను నిరాకరించినట్లు మీరన్ బోర్వంకర్ పేర్కొన్నారు. అజిత్ పవార్ సదరు ల్యాండ్‌ను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకోగా.. అప్పటి డివిజనల్ కమిషనర్ పర్యవేక్షించినట్లు ఆమె పుస్తకంలో ఆరోపించారు.
మేడమ్ కమిషనర్ అనే పుస్తకంలో ఇలాంటి అనేక వివాదాస్పద ఘటనలను ఆమె రాసుకొచ్చారు. సదరు పుస్తకంలో అజిత్ పవార్ పేరు నేరుగా పేర్కొనక పోయినా.. అప్పటి జిల్లా మంత్రి అనే రాసుకొచ్చారు. అంతే కాకా అతడిని 'దాదా' అని సంబోధించారు. ఇదే విషయంమై ఒక ఆంగ్ల పత్రిక ఆమెను వివరణ కోరగా.. దాదా అంటే అజిత్ పవార్ అని.. ఆయనే అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్నారని స్పష్టం చేశారు.
కాగా, ఈ ఆరోపణలను ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ పూర్తిగా ఖండించారు. పూణే పోలీస్ ల్యాండ్ వేలంలో తన పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. పైగా ఇలాంటి వేలం పాటలను తాను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. భూములను వేలం వేసే విషయంలో జిల్లా మంత్రికి ఎలాంటి అధికారం ఉండదని.. ప్రభుత్వ భూములను అలా వేలంలో అమ్మేయలేమని తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా వెళ్లే అభ్యర్థనను కేబినెట్ ఆమోదిస్తేనే ప్రభుత్వ భూములు వేలం వేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఒక వేళ తన దృష్టికి వస్తే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పి ఆపేవాడినని అన్నారు. నా మీద ఎంత ఒత్తిడి వచ్చినా.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వనని ఆయన పేర్కొన్నారు. అయితే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్‌ను సంప్రదించగా.. ఈ విషయంలో రికార్డులు పరిశీలించిన తర్వాతే తాను వ్యాఖ్యానిస్తానని తెలిపారు.
మేడమ్ కమిషనర్ అనే పుస్తకంలో 'ది మినిస్టర్' అనే చాప్టర్‌లో పూణేలో సీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు ఎదురైన సంఘటనలు వివరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే వివిధ పోలీస్టేషన్ల పరిధిలో జరుగుతున్న నేరాలను పరిశీలించాను. అలాగే పలువురు పోలీస్ అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించాను. అలాంటి సమయంలో డివిజనల్ కమిషనర్ నుంచి తనకు కాల్ వచ్చిందని అన్నారు. జిల్లా మంత్రి తనను కలవాలని అన్నారని.. రేపు ఒక సారి వెళ్లి సదరు మంత్రిని కలిస్తే .. ఆయన ఎరవాడ భూములకు సంబంధించి మాట్లాడతారని తనకు డివిజనల్ కమిషనర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.
తర్వాతి రోజు డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో మినిస్టర్‌ను కలిశాను. ఆయన దగ్గర ఒక పెద్ద మ్యాప్ ఉంది. దాన్ని చూపిస్తూ వేలాన్ని విజయవంతంగా పూర్తి చేశాము. మీరు ఆ భూమిని వేలంలో అత్యధిక ధర పాడిన అతనికి అప్పగించండని చెప్పినట్లు పుస్తకంలో రాశారు. అయితే, యరవాడ అనేది పూణే నగరం మధ్యలో ఉంటుంది. అలాంటి ప్రైమ్ ల్యాండ్ పోలీసు శాఖకు భవిష్యత్‌లో దొరకడం కష్టం. దాన్ని మరిన్ని కార్యాలయాలు, పోలీసు క్వార్టర్ల కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపానన్నారు.
తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. రాగానే ఇలా పోలీస్ ల్యాండ్‌ను ప్రైవేటు వ్యక్తులకు స్వాధీనం చేస్తే తనపై ఆరోపణలు వస్తాయి. తాను అలా చేయలేనని మినిస్టర్‌కు చెప్పినట్లు బోర్వంకర్ చెప్పారు. అలాంటి ఆరోపణలు ఏవీ రావు. ఇప్పటికే వేలం పూర్తి చేశాము. మిగిలిన ప్రాసెస్ మీరు పూర్తి చేయడం. ఈ మ్యాటర్‌ను ఇక్కడితో ముగిద్దామని మినిస్టర్ పేర్కొన్నట్లు సీపీ చెప్పారు. తాను ఈ ప్రాసెస్ పూర్తి చేయలేనని.. అది పోలీస్ శాఖకు చెందాల్సిన భూమి అని కుండ బద్దలు కొట్టాను. దీంతో మినిస్టర్ కోపంతో ఆ మ్యాప్‌ను ఎదురుగా ఉన్న టేబుల్ మీదికి విసిరేశారని ఆమె తెలిపారు.