Telugu Global
National

పంజాబ్ లో ప్ర‌జాస్వామ్యం గోవిందా..!! : అరవింద్ కేజ్రీవాల్

విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న పంజాబ్ ప్రభుత్వ డిమాండ్‌ను గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధ‌వారంనాడు తిరస్కరించారు. సెప్టెంబర్ 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలవాలన్న ఆదేశాలను గవర్నర్ ఉపసంహరించుకున్నారు. దీనిపై ఆప్ అధ్యక్షులు కేజ్రీవాల్ మండి పడ్డారు.

పంజాబ్ లో ప్ర‌జాస్వామ్యం గోవిందా..!! : అరవింద్ కేజ్రీవాల్
X

పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న నిర్ణ‌యంపై ఆప్ ప్ర‌భుత్వం మండిప‌డుతోంది. ఆప్ ఎమ్మెల్యేల‌ను బిజెపి ప్ర‌లోభ‌పెట్టి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని, ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బిజెపి ప్ర‌య‌త్నిస్తోంద‌న్నఆరోప‌ణ‌ల నేపథ్యంలో ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ సింగ్ మాన్ అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కోవాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా త‌మ బ‌లం చెక్కుచెద‌ర‌లేద‌ని నిరూపించాల‌నుకుంది. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ డిమాండ్‌ను గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధ‌వారంనాడు తిరస్కరించారు. సెప్టెంబర్ 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలవాలన్న ఆదేశాలను గవర్నర్ ఉపసంహరించుకున్నారు.

''కేబినెట్ ఆమోదించిన స్పెష‌ల్ సెషన్‌ను గవర్నర్‌ ఎలా తిరస్కరిస్తారు.. ఇక ప్రజాస్వామ్యం ముగిసిపోయింది. రెండు రోజుల క్రితం గవర్నర్‌ సెషన్‌కు అనుమతి ఇచ్చారు.. పంజాబ్ లో ఆప‌రేష‌న్ లోటస్ విఫలమవడం ప్రారంభించింది. నంబర్ పూర్తి కాలేదు, అనుమతిని ఉపసంహరించుకోమని పై నుండి కాల్ వచ్చింది." అంటూ గవర్నర్ నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

పంజాబ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన విశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకొని అసెంబ్లీని స‌మావేశ‌ప‌ర్చ‌డానికి సంబంధించి నిర్దిష్ట నియమాలు లేనందున మునుపటి ఆర్డర్ ఉపసంహరించుకున్నట్లు ఈరోజు జారీ చేసిన తాజా ఉత్తర్వులో గవర్నర్ పురోహిత్ తెలిపారు. దీనిపై ఆప్ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దా ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. "గౌరవనీయ గవర్నర్ ఉపసంహరణ ఉత్తర్వులు ఆయ‌న ఉద్దేశాన్ని తేట‌తెల్లం చేస్తున్నాయి. ఆయ‌న నిర్ణ‌యం ప్ర‌శ్నార్హ‌మ‌వుతోంది. ఇది సహేతుకమైన ఆలోచ‌న కాదు. అసెంబ్లీని ఎదుర్కోవాలనే ప్రభుత్వ నిర్ణయానికి అభ్యంతరం చెప్ప‌డం ఎందుకు? అని చ‌ద్దా ప్ర‌శ్నించారు.

First Published:  21 Sept 2022 9:51 PM IST
Next Story