Telugu Global
National

రాహుల్ కోసం 4 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చిన మహిళా కార్యకర్త

తన ఇంటిని రాహుల్ కి అప్పగిస్తున్నట్టుగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మోదీ, రాహుల్ ని పార్లమెంట్ నుంచి బయటకు పంపించవచ్చేమో కానీ, తమ హృదాయాల్లోనుంచి కాదని ఆమె అందులో వివరించారు.

రాహుల్ కోసం 4 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చిన మహిళా కార్యకర్త
X

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన తర్వాత, ఆయన అధికారిక బంగ్లా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులిచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. రాహుల్ తన ఇంటిలో ఉండొచ్చని, ఆయనకు తమ ఇంటిలో ఎప్పుడూ చోటు ఉందని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేరా ఘర్ -ఆప్ కా ఘర్ అనే నినాదాన్ని నేతలు తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షురాలు రాజ్ కుమారి గుప్తా.. తన నాలుగు అంతస్తుల బిల్డింగ్ ని రాహుల్ పేరిట మార్చేసినట్టు టైటిల్ డీడ్ రెడీ చేశారు. తన ఇంటిని రాహుల్ కి అప్పగిస్తున్నట్టు తెలిపారామె.

ఇందిరా గాంధీ హయాంలో మంగోల్ పురి ప్రాంతంలో మహిళా కాంగ్రెస్ నేత రాజ్ కుమారి గుప్తాకు కొంత స్థలం కేటాయించారు. ఆ స్థలంలో ఆమె 4 అంతస్తుల భవనం కట్టుకున్నారు. అ భవనాన్ని ఇప్పుడు రాహుల్ పేరిట మార్చారు. తన ఇంటిని రాహుల్ కి అప్పగిస్తున్నట్టుగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మోదీ, రాహుల్ ని పార్లమెంట్ నుంచి బయటకు పంపించవచ్చేమో కానీ, తమ హృదాయాల్లోనుంచి కాదని ఆమె అందులో వివరించారు.


ప్రతిపక్షాల ఆందోళన..

కోర్టు తీర్పుపై అప్పీల్ కి అవకాశం ఉన్నా కూడా హడావిడిగా రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దయినట్టు లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించడం, ఆ తర్వాత ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఉత్తర్వులివ్వడం, ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారమే జరిగాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం కుట్రలో భాగంగానే రాహుల్ ని ఇబ్బంది పెడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తనకు కేటాయించిన బంగ్లాతో తనకి చాలా జ్ఞాపకాలున్నాయని ఇటీవల రాహుల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

First Published:  2 April 2023 11:52 AM IST
Next Story