Telugu Global
National

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. తమ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు.

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
X

దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పలు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు వార్తలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరుగు పరుగున పాఠశాలలకు చేరుకొని తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు ప్రముఖ స్కూళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్, నోయిడాలోని మొత్తం 12 స్కూళ్లకు ఈ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

వెంటనే అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. తరగతి గదుల్లో పిల్లలు లేకుండా బయటకు తీసుకువచ్చాయి. పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. తమ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు బాంబు స్క్వాడ్ తో బాంబు బెదిరింపు అందుకున్న పాఠశాలల వద్దకు చేరుకొని తనిఖీలు జరిపారు.

అయితే ఇప్పటివరకు ఆ స్కూళ్లలో ఎటువంటి పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించలేదు. బాంబులు పెట్టినట్లు బెదిరిస్తూ వచ్చిన ఈ -మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఈ-మెయిల్ ఐపీ అడ్రస్ లను బట్టి విదేశాల నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒకే వ్యక్తి అన్ని పాఠశాలలకు ఈ బెదిరింపు మెయిల్ పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఢిల్లీలోని స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు వచ్చాయి. గత ఫిబ్రవరిలో కూడా ఇటువంటి బెదిరింపులు రావడంతో పోలీసులు ఆయా పాఠశాలలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. వారికి ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అవి నకిలీ బెదిరింపులుగా తేల్చేశారు.

First Published:  1 May 2024 5:38 AM GMT
Next Story