Telugu Global
National

మహిళా కానిస్టేబుల్ హత్య.. బతికే ఉందంటూ రెండేళ్లుగా డ్రామా..

సురేంద్ర అద్భుతమైన కట్టుకథ‌ అల్లటం ప్రారంభించాడు. మోనా సన్నిహితుడిని అంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అరవింద్ అనే వ్యక్తితో ఆమె వెళ్లిపోయినట్లుగా తెలియజేశాడు.

మహిళా కానిస్టేబుల్ హత్య.. బతికే ఉందంటూ రెండేళ్లుగా డ్రామా..
X

ఒక మహిళా కానిస్టేబుల్‌ను మరో హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు.. అంతటితో ఆగక ఆమె బతికి ఉన్నట్టు అందరినీ నమ్మించాడు. ఎంత చేసినా చివరికి పోలీసులనుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఠీవిగా పోలీస్ స్టేషన్లో ఉండవలిసినవాడు కాస్త ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సురేంద్ర రానా అనే వ్యక్తి ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. మోనా అనే యువతి 2014లో కానిస్టేబుల్ గా విధుల్లో జాయిన్ అయింది. వీరిద్దరూ కొంతకాలం పాటు ఒకే కంట్రోల్ రూమ్ లో డ్యూటీ చేశారు. తరువాత మోనాకు యూపీ పోలీస్ విభాగంలో ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగం మానేసింది. కానీ, సురేంద్ర ఆమెని అభిమానిస్తున్నాను అంటూ దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. మోనా అంగీకరించకపోవటంతో 2021 సెప్టెంబర్ 8న ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసాడు. శవాన్ని పక్కనే ఉన్న మురుగు కాలువలో పడేసి పెద్ద బండరాళ్లతో కప్పేసాడు.

ఆ తర్వాత నుంచి సురేంద్ర అద్భుతమైన కట్టుకథ‌ అల్లటం ప్రారంభించాడు. మోనా సన్నిహితుడిని అంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అరవింద్ అనే వ్యక్తితో ఆమె వెళ్లిపోయినట్లుగా తెలియజేశాడు. మోనా కోసం తను కూడా గాలిస్తున్నట్లుగా వారిని నమ్మించడం కోసం వారితో చాలాసార్లు పోలీస్ స్టేషన్‌లకు వెళ్లాడు. మోనా పేరు మీద వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పుట్టించాడు. ఆమె బ్యాంకు ఖాతాని, సిమ్ కార్డులను ఉపయోగించాడు.

ఈ పనిలో సహాయం చేయడం కోసం తన బావమరిది రాబిన్ ను అరవింద్ పేరుతో రంగంలోకి దించాడు. రాబిన్ వివిధ హోటళ్లకు వ్యభిచారులతో కలిసి వెళ్లి అక్కడ మోనా పేరుతో రూమ్ బుక్ చేసేవాడు. తరువాత ఎవరైనా ఎంక్వయిరీ కోసం ఆ హోటల్స్‌కు వెళ్లినా, వాళ్ళు మోనాకు సంబంధించిన పత్రాలనే చూపించేవాళ్ళు. ఈ డ్రామాతో మోనా బతికి ఉన్నట్టుగా కుటుంబ స‌భ్యులు, పోలీసులు పూర్తిగా నమ్మేశారు. మోనా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి భయపడుతోందని నిర్ధారణకి వచ్చారు.

అయితే ఈ కేసు రెండు నెలల క్రితం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి చేరింది. వారు అరవింద్ పేరుతో రాబిన్ వాడుతున్న ఫోన్ నెంబర్లను ట్రేస్ చేయగా కానిస్టేబుల్ సురేంద్ర గుట్టు రట్టయింది. ప్రస్తుతం సురేంద్ర, రాబిన్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మోనా అవశేషాలను మురుగు కాలువ నుంచి వెలికి తీసి డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

First Published:  2 Oct 2023 6:52 PM IST
Next Story