ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు.. నాతో సహా మరో నలుగురు ఆప్ నేతలు జైలుకే..
`కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి నేతలంతా జైల్లో ఉన్నా కూడా ఆప్ ఇంకా బలంగా ఉండటాన్ని బీజేపీ సహించలేకపోతోంది. ఆప్ ఇంకా ఐక్యంగానే ఉండటంతో తర్వాత వరుసలో ఉన్న మామీద గురిపెట్టింది`.
మద్యం కుంభకోణం ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి, ఆప్ కీలక నేత ఆతిశీ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంతో తనతోపాటు మొత్తం నలుగురు ఆప్ నేతలు త్వరలోనే జైలుకెళ్లబోతున్నామని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజధానిలో హాట్ టాపిక్‌గా మారాయి.
కేజ్రీవాల్ చెప్పారంటూ పేర్లు బయటపెట్టిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కేజ్రీవాల్ విచారణలో కీలక విషయాలను వెల్లడించారని ఈడీ కోర్టు ముందు చెప్పింది. ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ తనకేమీ చెప్పలేదని.. ఆయన ఆతిశీ భరద్వాజ్, సౌరభ్ భరద్వాజ్‌లకే రిపోర్టు చేసేవాడని కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజుకోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆతిశీ త్వరలో తాము కూడా అరెస్టవబోతున్నామని కామెంట్ చేశారు.
ఆప్‌ను ముక్కలు చేయాలనే
`కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి నేతలంతా జైల్లో ఉన్నా కూడా ఆప్ ఇంకా బలంగా ఉండటాన్ని బీజేపీ సహించలేకపోతోంది. ఆప్ ఇంకా ఐక్యంగానే ఉండటంతో తర్వాత వరుసలో ఉన్న మామీద గురిపెట్టింది. నిన్న కోర్టులో నా పేరు, సౌరభ్ పేరు బయటపెట్టింది. ఈ స్టేట్‌మెంట్ ఎప్పటి నుంచో ఈడీ దగ్గరున్నా ఇప్పుడే బయటపెట్డడానికి కారణం ఆప్‌ను మరింత ఇబ్బంది పెట్టాలనే`.. అని ఆతిశీ విమర్శించారు.
నన్ను బీజేపీలోకి రమ్మన్నారు
`నీ రాజకీయ జీవితం బాగుండాలంటే బీజేపీలోకి వచ్చేయ్ అని వారు నన్ను సంప్రదించారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అందుకే ఈ కేసులో మా పేర్లను తెరపైకి తెచ్చారు`అని ఆతిశీ మండిపడ్డారు.