Telugu Global
National

ఢిల్లీ మేయర్ ఎన్నిక: బీజేపీకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసి, వచ్చే సోమవారంలోగా వారి నుండి సమాధానాలు కోరుతున్నట్లు తెలిపింది.

ఢిల్లీ మేయర్ ఎన్నిక: బీజేపీకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు
X

ఇప్పటికీ మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడటాన్ని వ్యతిరేకిస్తూ మేయర్ ఎన్నికను త్వరగా నిర్వహించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం, MCD ప్రోటెం ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ లకు నోటీసులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసి, వచ్చే సోమవారంలోగా వారి నుండి సమాధానాలు కోరుతున్నట్లు తెలిపింది.

సభను మూడుసార్లు పిలిచినా మేయర్‌ ఎన్నిక జరగలేదని సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వీ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.

“మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని MCD ప్రోటెం ప్రిసైడింగ్ అధికారి పట్టుబట్టడంతోపాటు మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఇది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి విరుద్ధం'' అని అన్నారు. సింఘ్వీ వాదనలను విన్న‌ ధర్మాసనం, దీనిపై సోమవారం విచారణ జరుపుతామని తెలిపింది.

కాగా కీలకమైన 18 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులలో ఆరుగురుని ఈ నెల‌ 6వ తేదీన ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కుంచుకోనుంది. కీలకమైన ఆరో సీటు విషయంలోనే సభలో గందరగోళం తలెత్తింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఓటు వేసేందుకు అనుమతించడాన్ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతివ్వడం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి విరుద్ధమని ఆప్ వాదిస్తోంది.

అయితే ఎలాగైనా ప్రొటెంస్పీకర్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) నామినేట్ చేసిన 10 మంది ఢిల్లీ కౌన్సిలర్ల మద్దతుతో స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలిపించుకోవడమే కాక, మేయర్ సీటును కూడా ఎగరేసుకపోవాలనుకున్న బీజేపీ, సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించడం, లెఫ్టినెంట్ గవర్నర్, ప్రొటెంస్పీకర్ లకు నోటీసులు జారీ చేయడంతో ఆందోళన చెందుతోంది.

First Published:  8 Feb 2023 2:10 PM IST
Next Story