Telugu Global
National

బీజేపీ వెనకడుగు.. ఢిల్లీ మేయర్‌ పీఠం మళ్లీ ఆమ్ ఆద్మీదే..

ఈసారి కూడా పోటీ తప్పదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులిద్దరూ వెనక్కు తగ్గారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది, ఆ రెండు పదవులూ ఆప్ నే వరించాయి.

Delhi MCD Mayor Election 2023: Delhi mayor election AAP candidate elected unanimously
X

బీజేపీ వెనకడుగు.. ఢిల్లీ మేయర్‌ పీఠం మళ్లీ ఆమ్ ఆద్మీదే..

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. మేయర్‌ పీఠాన్ని వరుసగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. చివరి నిమిషంలో ఓటమి గ్రహించిన బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్‌, నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో.. ఆమ్ ఆద్మీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మరోసారి ఢిల్లీ మేయర్‌ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పోటీ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి సోనీపాల్ వెనక్కి తగ్గడంతో అక్కడ కూడా ఆమ్ ఆద్మీ అభ్యర్థి అలీ మహ్మద్ ఇక్బాల్ విజయం సాధించారు.

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కి గతేడాది డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా.. మేయర్ ఎన్నిక మాత్రం గొడవలతో మూడుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్ గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ ప్రకారం.. మార్చి 31వ తేదీతో మేయర్ పదవీ కాలం ముగియడంతో మరోసారి తాజాగా ఎన్నికలు నిర్వహించారు. ఈసారి కూడా పోటీ తప్పదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులిద్దరూ వెనక్కు తగ్గారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది, ఆ రెండు పదవులూ ఆప్ నే వరించాయి.


తిరిగి మేయర్ గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్ ఒక సంవత్సరం పదవిలో ఉంటారు. రొటేషన్ ప్రాతిపదికన వచ్చే ఏడాది మరొకర్ని ఎన్నుకుంటారు. ఐదేళ్ల కాలపరిమితిలో ఏడాదికొక్కరు మేయర్‌ గా ఉంటారు. తొలి ఏడాది మహిళలకు, రెండో ఏడాది ఓపెన్ కేటగిరీకి, మూడో సంవత్సరం రిజర్వ్‌ డ్ కేటగిరీకి, చివరి రెండేళ్లు మళ్లీ ఓపెన్ కేటగిరీ కింద మేయర్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఢిల్లీని ఒకటే కార్పొరేషన్ చేసిన తర్వాత మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 చోట్ల గెలుపొందగా, బీజేపీకి 104 సీట్లు వచ్చాయి.

First Published:  26 April 2023 5:27 PM IST
Next Story