యువకుడి కడుపులో నాణాలు, మ్యాగ్నెట్లు.. ఎందుకు మింగాడో తెలిస్తే షాక్..
ఆపరేషన్ చేసి మొత్తం 39 నాణాలు వాటితో పాటూ రకరకాల ఆకారంలో ఉన్న 37 అయస్కాంతాలను బయటకు తీశారు.
కండలు తిరిగిన బాడీ కోసం జిమ్ లో కసరత్తులు చేయడం తెలుసు.. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడమూ తెలుసు. కానీ ఓ యువకుడు బాడీ బిల్డింగ్ కోసం నాణాలు, అయస్కాంతాలు మింగాడు. శరీర ధృడత్వానికి కు జింక్ అవసరమని భావించి, కనిపించినవన్నీ లోపలేశాడు. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.
పొత్తి కడుపులో నొప్పి, వాంతులతో 26 ఏళ్ల ఓ యువకుడు ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. గడిచిన 20 రోజులుగా వాంతులతో ఏమీ తినలేకపోతున్నాడని కనీసం నీరు కూడా తీసుకోలేకపోతున్నాడని గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సీటీ స్కాన్ చేయగా అతని కడుపులో నాణాలు, అయస్కాంతాలు ఉన్నట్లు తేల్చారు. పేగుల్లోకి చేరిన నాణాలు ఆహారం లోపలికి చేరకుండా అడ్డుకుంటున్నాయని గుర్తించారు. దీంతో ఆపరేషన్ చేసి మొత్తం 39 నాణాలు వాటితో పాటూ రకరకాల ఆకారంలో ఉన్న 37 అయస్కాంతాలను బయటకు తీశారు. నాణేలన్నీ ఒకటి, రెండు, ఐదు రూపాయల కాయిన్స్ కాగా.. హార్ట్, స్టార్, ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న అయస్కాంతాలను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత కాస్త కోలుకున్న యువకుడిని ప్రశ్నించగా..అతను చెప్పిన జవాబు విని అందరూ ఆశ్చర్యపోయారు.
శరీర ధారుఢ్యం కోసం జింక్ అవసరమని, నాణాల్లో జింక్ మూలకం ఉంటుందని, అయితే అది కడుపులో ఎక్కువ సేపు ఉండాలంటే మ్యాగ్నెట్ అవసరమని అందుకే ఆ రెంటిండిని కలిపి తీసుకున్నానన్నాడు ఆ యువకుడు. వారం రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువకుడిని డిశ్చార్జి చేశామని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడనే అనుమానంతో సైకియాట్రిస్ట్ కు రిఫర్ చేశామని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ చెప్పారు.