మిస్డ్ కాల్‌తో లక్షలు కొట్టేశారు..!
ఈ మోసానికి పాల్పడింది జార్ఖండ్‌లోని జాంతారా ప్రాంతానికి చెందిన సైబర్ నేరగాళ్లని పోలీసులను అనుమానిస్తున్నారు. సిమ్ స్వాప్ ద్వారా బాధితుడి ఖాతా నుంచి నగదు స్వాహా చేశారని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ వినియోగంలో రోజురోజుకీ అప్‌డేట్ అవుతున్నారు. దీంతో వారి నేరాల తీరు కూడా రోజురోజుకీ అంతుపట్టని విధంగా సాగుతోంది. అవేమిటో తెలుసుకుని.. జాగ్రత్త పడేలోపే.. ఖాతాల్లో ఉన్న సొమ్ము కొల్లగొడుతున్నారు. తాజాగా దక్షిణ ఢిల్లీలో జరిగిన సైబర్ మోసం కూడా అలాంటిదే. ఓటీపీ అవసరం లేకుండానే.. మిస్డ్ కాల్‌తో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు.
పలుమార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చి...
దక్షిణ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థను నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతని ఫోన్‌కి రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల మధ్యలో పలుమార్లు మిస్డ్ కాల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని లిఫ్ట్ చేయగా, అవతలి నుంచి ఎవరూ మాట్లాడలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన కాల్స్ గురించి అతను పట్టించుకోలేదు.
సిమ్ స్వాప్ ద్వారా సొమ్ము స్వాహా...
అయితే.. కొద్ది సమయం తర్వాత ఆర్‌టీజీఎస్ ద్వారా నగదు బదిలీ అయినట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కంగారుపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మొత్తంగా రూ.50 లక్షల నగదు అతని ఖాతా నుంచి బదిలీ అయినట్టు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ మోసానికి పాల్పడింది జార్ఖండ్‌లోని జాంతారా ప్రాంతానికి చెందిన సైబర్ నేరగాళ్లని అనుమానిస్తున్నారు. సిమ్ స్వాప్ ద్వారా బాధితుడి ఖాతా నుంచి నగదు స్వాహా చేశారని తెలిపారు. బ్లాంక్ లేదా మిస్డ్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్‌టీజీఎస్‌కు చెందిన ఓటీపీని యాక్టివేట్ చేసి.. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వాటిని పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.