Telugu Global
National

సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ కూతురిపై పోస్టులను తొలగించాలన్న ఢిల్లీ హైకోర్టు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ , ఆమె కూతురుపై కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు శుక్రవారం కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది.

సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ కూతురిపై పోస్టులను తొలగించాలన్న ఢిల్లీ హైకోర్టు
X

గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు నిర్వహిస్తున్నట్టు చెబుతున్న అక్రమ బార్ అండ్ రెస్టారెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన కుమార్తెపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలమీద స్మృతి ఇరానీ కోర్టుకెక్కిన‌ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. స్మృతిపైన, ఆమె కుమార్తెపైన వీరు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు, ట్వీట్లు, రీట్వీట్లు, మార్ఫ్ చేసిన ఫోటోలు, అన్నింటినీ తొలగించాలని జస్టిస్ మిని పుష్కర్ణ ఆదేశించారు. వాస్తవాలను వెరిఫై చేయకుండా కాంగ్రెస్ నేతలు దురుద్దేశపూరిత ఆరోపణలు చేశారని తాను భావిస్తున్నానన్నారు. సమన్లు అందుకున్న కాంగ్రెస్ నేతలు జైరాంరమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా మాత్రం ఈ ఉత్తర్వులను సవాలు చేస్తామని తెలిపారు.

కాగా-తనతో పాటు తన కూతురి ప్రతిష్ట కూడా దెబ్బ తిన్నదని, రూ. 2 కోట్ల పరిహారంతో పాటు తప్పనిసరిగా శాశ్వత ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలంటూ స్మృతి ఇరానీ పరువునష్టం దావా వేశారు. ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు పెట్టిన పోస్టులు, ప్రెస్ మీట్లలో వారు చేసిన వ్యాఖ్యల కారణంగా స్మృతి, ఆమె కుమార్తె ప్రతిష్ట దెబ్బతిన్నదని తాము భావిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీటినన్నింటినీ కాంగ్రెస్ నేతలు 24 గంటల్లోగా తొలగించక పోతే . ఈ సామాజిక మాధ్యమాలే వాటిని డిలీట్ చేయాలని కోర్టు ఆదేశించింది. జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలు ఇతర అజ్ఞాత వ్యక్తులతో కుమ్మక్కయి తనపైన, తన కూతురిపైనా దుష్ప్రచారానికి దిగారని స్మృతి ఇరానీ తన దావాలో ఆరోపించారు.

ఢిల్లీ హైకోర్టు తమకు నోటీసులు జారీ చేసిందని, అయితే వాస్తవాలను తాము కోర్టుకు తెలియజేస్తామని జైరాంరమేష్ ట్వీట్ చేశారు. స్మృతి మాపై చేసిన ఆరోపణలను సవాల్ చేస్తామని, మా మీద కూడా ఆమె చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. గోవాలో స్మృతి కూతురు అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తోందని, మరణించిన వ్యక్తి పేరిట ఫేక్ లైసెన్స్ తో దీన్ని నడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఈ నెల 23 న ఆరోపించింది.






First Published:  29 July 2022 8:02 PM IST
Next Story