ఆదిపురుష్ టీంకు షాక్...హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఆదిపురుష్ మూవీ టీంకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు హీరో ప్రభాస్ సహా మూవీ టీం కు నోటీసులు జారీ చేసింది.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలను తప్పుగా చూపించారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని రాజ్ గౌరవ్ అనే న్యాయవాది పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. వాక్ స్వాతంత్య్రం ముసుగులో రామాయణాన్ని మార్చడానికి వీల్లేదని ఆయన పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు... తాజాగా ఆదిపురుష్ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. హీరో ప్రభాస్‌కి కూడా నోటీసులు పంపారు.
"ఈ టీజర్‌లో రాముడు, హనుమంతుడిని అసమంజసంగా చూపించారు ఈ రెండు పాత్రలు రబ్బరు దుస్తులు ధరించి ఉన్నాయి, రావణుడిని కూడా తప్పుగా చూపించారు. హిందువుల మత, సాంస్కృతిక, చారిత్రక, నాగరికత మనోభావాలను దెబ్బతీసేలా మూడు పాత్రలను టీజర్‌లో చూపించారు, హిందువుల విశ్వాసం ప్రకారం.. రాముడు ప్రశాంతంగా, ఉదారంగా ఉండేవాడు. కానీ ఈ టీజర్‌లో రాముడిని కోపంగా, ఇతరులను చంపాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తిగా చూపించారు. రావణుడి పాత్రను చాలా చీప్ గా చూపించారు.''అని పిటిషనర్ రాజ్ గౌరవ్ పేర్కొన్నాడు.
అంతేకాదు, అనేక దేశాల్లో పూజలు అందుకుంటున్న రావణుడిని భారత్‌పై దండెత్తిన మొఘలుల పూర్వీకుడిగా చూపించారని రాజ్ గౌరవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారు. మరోవైపు.. ఈ సినిమాపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. పాత్రల కాస్ట్యూమ్స్ సరిగా లేవని, ఈ సినిమాను నిషేధించాలని పట్టుబడుతున్నారు.