Telugu Global
National

మ‌నీశ్ సిసోడియాకు హైకోర్టు షాక్‌.. - బెయిల్ పిటీష‌న్‌ తిర‌స్క‌ర‌ణ‌

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌నీశ్ సిసోడియా బ‌య‌టికి వ‌స్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని న్యాయ‌స్థానం తెలిపింది.

మ‌నీశ్ సిసోడియాకు హైకోర్టు షాక్‌.. - బెయిల్ పిటీష‌న్‌ తిర‌స్క‌ర‌ణ‌
X

ఢిల్లీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌ మ‌నీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని న్యాయస్థానం స్ప‌ష్టం చేసింది. ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లు చాలా తీవ్ర‌మైన‌వ‌ని కోర్టు ఈ సంద‌ర్భంగా తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ మంగళవారం తీర్పు చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో ఆయ‌న్ని సీబీఐ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం..

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌నీశ్ సిసోడియా బ‌య‌టికి వ‌స్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వలేమని స్ప‌ష్టం చేసింది. అయితే మ‌నీశ్ సిసోడియా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ త‌ర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తిహార్‌ జైలుకు తరలించారు. ఇటీవల ఆయన కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1వ‌ తేదీ వరకు పొడిగించింది.

First Published:  30 May 2023 12:24 PM IST
Next Story