Telugu Global
National

టపాసుల నిషేధంపై పిటిషన్.. తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ ప్రభుత్వం టపాసులు విక్రయాలను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ కొందరు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది.

టపాసుల నిషేధంపై పిటిషన్.. తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
X

ఢిల్లీలో వరుసగా మూడో ఏడాది దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం, క్రయవిక్రయాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ నగరంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించి టపాసులు తయారు చేసినా, విక్రయించినా రూ.5 వేల జరిమానా విధిస్తామని, మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే వీధుల్లో టపాసులు కాల్చే ప్రజలకు రూ.200 జరిమానా విధించడంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ప్రభుత్వం టపాసులు విక్రయాలను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ కొందరు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తాము నష్టపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది.

దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి(డీపీసీసీ) వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీ నగరంలో టపాసుల అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించింది. డీపీసీసీ తీసుకున్న నిర్ణయం కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామని, కనీసం పండుగ సీజన్లో అయినా గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయడానికి, నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన బాణాసంచా వ్యాపారులు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ యశ్వంత్ వర్మ తోసిపుచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచా నిల్వ, క్రయవిక్రయాలపై నిషేధించడంపై ఇప్పటికే కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, సుప్రీంలో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందువల్ల దీనిపై విచారణ చేపట్టడం సరికాదని కోర్టు పేర్కొంది. దీపావళి సమయంలో బాణాసంచా కాల్చడం వల్ల నగరంలో మళ్లీ కాలుష్యం పెరుగుతుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

First Published:  20 Oct 2022 5:34 PM IST
Next Story