Telugu Global
National

బీజేపీ నేత షానవాజ్ హుసేన్ పై రేప్ కేసు పెట్టాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం

బీజేపీ నేత షానవాజ్ హుసేన్ తనపై అత్యాచారం చేశాడంటూ 2018 లో ఓ మహిళ చేసిన పిర్యాదుపై ఢిల్లీహైకోర్టు స్పందించింది. ఆయనపై తక్షణం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

బీజేపీ నేత షానవాజ్ హుసేన్ పై రేప్ కేసు పెట్టాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం
X

బీజేపీ నేత షానవాజ్ హుసేన్ పై రేప్ కేసు నమోదు చేయాల్సిందేనని ఢిల్లీహైకోర్టు పోలీసులను ఆదేశించింది.ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖాకీలను కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. షానవాజ్ హుసేన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 2018 లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ట్రయల్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని హుసేన్ పిటిషన్ పెట్టుకున్నారు. దీన్ని ఢిల్లీహైకోర్టు తిరస్కరిస్తూ.. దిగువ కోర్టు జారీ చేసిన ఆదేశాలు సక్రమమేనని, ఇప్పటికైనా ఈ నేతపై కేసు పెట్టి మూడు నెలల్లోగా విచారణ ముగించాలని రూలింగ్ ఇచ్చింది. షానవాజ్ హుసేన్ బీజేపీ నేత అయినందున మీరు ఆయనపై ఎఫ్ఐఆర్ పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారా అని జస్టిస్ ఆశా మీనన్ ..ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు.

నాలుగు సందర్భాల్లో ప్రాసిక్యూటర్ల స్టేట్ మెంట్ గురించి పోలీసులు తమ స్టేటస్ రిపోర్టులో ప్రస్తావించారని.. కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేదో సంజాయిషీ ఇవ్వలేదని న్యాయమూర్తి అన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ కి పునాదివంటిదని, దీన్ని బట్టి ఓ కేసులో దర్యాప్తు తరువాతే నేరం జరిగిందా. లేదా అన్న నిర్ధారణకు పోలీసులు వస్తారని కోర్టు పేర్కొంది. దిగువ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలన్న షానవాజ్ హుసేన్ అభ్యర్థనలో మెరిట్ లేదని, దీన్ని కొట్టివేస్తున్నామని పేర్కొన్న జస్టిస్ ఆశా మీనన్.. తక్షణమే ఈయనమీద ఎఫ్ఐఆర్ పెట్టాలని పోలీసులకు సూచించారు. ఈ కేసులో వీరు అత్యంత ఉదాసీనంగా వ్యవహరించినట్టు కనబడుతోందని కోర్టు అభిప్రాయపడింది.




First Published:  18 Aug 2022 3:48 PM IST
Next Story