కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిల్ విచారణకు హైకోర్టు నో
కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలంటూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు స్వల్ప ఊరట లభించింది. జైల్లో ఉన్న ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో జైల్లో ఉన్నా ప్రస్తుతానికి ఆయన పదవికి ఏం ఢోకా లేనట్లే.
మేం నిర్ణయం తీసుకోలేం
కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలంటూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలరని పేర్కొంది.
రెండో పిల్ కూడా కొట్టివేత
కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిల్ దాఖలవడం ఇది రెండోసారి. గత నెల 28న సూరజ్‌సింగ్ యాదవ్ అనే వ్యక్తి వేసిన పిల్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.