Telugu Global
National

పార్టీలను తిట్టడం తప్పు కాదు.. జర్నలిస్ట్ జుబేర్ కి ఢిల్లీకోర్టు బెయిల్ మంజూరు

ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటనా స్వేఛ్చ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. అధికార పార్టీని తిడితే ఇక సదరు వ్యక్తికి సంకెళ్లే ! మరి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిజం అన్నవి కాగితాలమీదే ఉంటున్నాయి.

పార్టీలను తిట్టడం తప్పు కాదు.. జర్నలిస్ట్ జుబేర్ కి ఢిల్లీకోర్టు బెయిల్ మంజూరు
X

ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటనా స్వేఛ్చ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. అధికార పార్టీని తిడితే ఇక సదరు వ్యక్తికి సంకెళ్లే ! మరి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిజం అన్నవి కాగితాలమీదే ఉంటున్నాయి. ఏదో ఒక సెక్షన్ కింద కేసు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. అయితే ఇదే సమయంలో బాధితులు కోర్టులకెక్కితే ఒక్కోసారి న్యాయం జరుగుతుంది. ఇంకొకసారి మరో కోర్టు నో చెబుతుంది. తాజాగా జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ కో-ఆర్డినేటర్ మహమ్మద్ జుబేర్ కి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల బాండ్, ఓ షూర్యుటీ పై అతనికి బెయిల్ ఇచ్చింది. కానీ కోర్టు అనుమతి లేనిదే దేశాన్ని వదిలివెళ్లరాదని ఆదేశించింది. ప్రధాని మోడీని, ఆయన మంత్రులను విమర్శించే జుబేర్ స్వేఛ్చా జీవి అయ్యాడు. ఇతనికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి దేవేందర్ కుమార్ జంగ్లా.. భావ ప్రకటనా స్వేఛ్చపై సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటే తప్ప ప్రజాస్వామ్యమన్నది పని చేయజాలదని, పరిఢవిల్లజాలదని అన్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణం 19 (1) (a) కింద భావ ప్రకటనా స్వేచ్చ అన్నదొకటి ఉందని, ఇది నిస్సందేహంగా ప్రజాస్వామిక సమాజానికి పునాది వంటిదని ఆయన అభివర్ణించారు. ఒకరు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసినప్పుడు అది ఫ్రీ సొసైటీకి సూచిక అవుతుందన్నారు.

ఇదే సమయంలో ఒక వ్యక్తి చేసే ట్వీట్లు మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టరాదని, హిందూ మతం అతి ప్రాచీనమైనదని, హిందువులు ఎంతో సహనపరులని ఆయన వ్యాఖ్యానించారు. ఏ సంస్థకు లేదా కేంద్రానికి, లేక శిశువుకు హిందూ దేవత లేదా దేవుడి పేరు పెట్టినా అది ఐపీసీలోని 153 ఏ, 295 ఏ సెక్షన్లను అతిక్రమించినట్టు కాదని దేవేందర్ కుమార్ జంగ్లా స్పష్టం చేశారు, కానీ ఈ విషయంలో దురుద్దేశాలు ఉండరాదన్నారు. అలా జరిగితే అది నేరమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు,

జుబేర్ లోగడ చేసిన ట్వీట్లపై ఆయన స్పందిస్తూ ..భారత ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలు విమర్శలకు అతీతమేమీ కాదని, తమ పాలసీల విషయంలో ప్రజలు చేసే విమర్శలకు అవి బిడియపడడం లేదని ఆయన చెప్పారు, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అసంతృప్తి గళం ఎప్పుడూ అవసరమేనన్నారు. ఈ కారణంగా ఒక పార్టీని విమర్శించినంత మాత్రాన ఆ విమర్శను పట్టుకుని 153 ఏ, 295 ఏ సెక్షన్లను ఉపయోగించుకోచూడరాదని ఆయన స్పష్టం చేశారు. ఇంతకీ జుబేర్ కేసు ఏమిటి ? 1983 లో వచ్చిన ఓ హిందీ మూవీలోని స్క్రీన్ షాట్ ని ఇతగాడు తన ట్వీట్ లో పేర్కొన్నాడు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఓ హోటల్ బోర్డుపై హనీమూన్ హోటల్ అనే పేరిట బోర్డు ఉండగా.. ఈ పార్టీ అధికారం లోకి వచ్చాక ఆ హోటల్ మీద హనుమాన్ హోటల్ అన్న బోర్డు కనిపించింది. దీనిపై జుబేర్ వ్యంగ్యంగా ట్వీట్ చేయడంతో కొన్ని హిందూ సంఘాలు ఇతనిపై కేసు పెట్టాయి. గత జూన్ 27 న ఢిల్లీ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.

ఇతనిపై ఇంకా ఎన్నో కేసులున్నాయి. నేటి కోర్టు ఉత్తర్వుల్లో రెండు కేసుల్లో ఇతనికి బెయిల్ లభించినప్పటికీ మూడో కేసు యూపీ లోని లఖింపూర్ ఖేరి కోర్టులో నలుగుతోంది. సీతాపూర్ కేసుకు సంబంధించి జుబేర్ కి సెప్టెంబరు 7 వరకు తాత్కాలిక బెయిల్ లభించింది. అయితే తన ట్వీట్ల నేపథ్యంలో యూపీ పోలీసులు తనపై పెట్టిన ఆరు కేసులనూ రద్దు చేయాలని కోరుతూ ఈ జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కాడు.

తీస్తా సెతల్వాద్ కి బెయిల్ వస్తుందా ?

ఈ సందర్భంలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కేసును కూడా చర్చించుకోవాల్సి వస్తోంది. 2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను ఈమెతో బాటు మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆర్.బీ. శ్రీకుమార్ తారుమారు చేశారన్న ఆరోపణపై గుజరాత్ పోలీసులు వీరినిద్దరినీ అరెస్టు చేశారు. వీరిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి అహమ్మదాబాద్ కోర్టు అనుమతించింది. ముంబైలో ఉన్న సెతల్వాద్ ఇంటికి వెళ్లి మరీ ఆమెను ఖాకీలు అరెస్టు చేశారు. నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి,ఇతరులకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వీరిద్దరూ సవాల్ చేశారు. మరి భావ ప్రకటనా స్వేచ్ఛపై ఢిల్లీ కోర్టు ఒక జర్నలిస్టుకు బెయిల్ ఇవ్వగా ఇప్పడు అహమ్మదాబాద్ కోర్టు సెతల్వాద్, శ్రీకుమార్ లకు బెయిల్ ఇస్తుందా? వేచి చూడాలి ! అన్నట్టు ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ పోలీసు అధికారి సంజయ్ భట్ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందన్నది కూడా తెలియాల్సి ఉంది.





First Published:  15 July 2022 6:26 PM IST
Next Story