Telugu Global
National

రాహుల్ గాంధీ పాస్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు

రాహుల్ 10 ఏళ్లకు ఎన్‌వోసీ అడిగినా.. నేషనల్ హెరాల్డ్ కేసు, మోడీ వ్యాఖ్యల కేసు ఉండటంతో మూడేళ్లకే కోర్టు ఎన్‌వోసీ జారీ చేసింది.

రాహుల్ గాంధీ పాస్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
X

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సస్పెండెడ్ ఎంపీ రాహుల్ గాంధీకి పాస్‌పోర్ట్ జారీ విషయంలో ఊరట లభించింది. సాధారణ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) జారీ చేయాలని రాహుల్ వేసిన పిటిషన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సానుకూలంగా స్పందించింది. మూడేళ్ల కాలానికి ఢిల్లీ కోర్టు ఎన్‌వోసీ జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ త్వరలోనే కొత్త పాస్‌పోర్ట్ పొందేందుకు వీలు లభించింది. ఆయన మరికొన్ని రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి పాస్‌పోర్ట్ విషయంలో ఊరట లభించడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.

'మోడీ ఇంటి పేరు' వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభలో ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు పడింది. ఎంపీ పదవి కోల్పోవడంతో రాహుల్ గాంధీ డిప్లొమాటిక్ పాస్‌పోస్టును అధికారులకు అప్పగించారు. దాని స్థానంలో సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని జారీ చేయడానికి ఎన్‌వోసీ అవసరం కావడంతో కోర్టును ఆశ్రయించారు.

అయితే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. రాహుల్‌కు పాస్‌పోర్టు మంజూరు చేయవద్దని కోర్టును విజ్ఞప్తి చేశారు. 2015 నుంచి ఆయన నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్నారని.. ఆయన ఎన్‌వోసీ పిటిషన్ కొట్టి వేయాలని కోరారు. ఈ విషయంపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో బెయిల్ మంజూరు సమయంలో ప్రయాణాలపై ఆంక్షలు లేకపోవడంతో మూడేళ్ల పాటు ఎన్‌వోసీని జారీ చేసింది. రాహుల్ 10 ఏళ్లకు ఎన్‌వోసీ అడిగినా.. నేషనల్ హెరాల్డ్ కేసు, మోడీ వ్యాఖ్యల కేసు ఉండటంతో మూడేళ్లకే కోర్టు ఎన్‌వోసీ జారీ చేసింది.

రాహుల్ గాంధీ ఈ నెల 31 నుంచి పది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. జూన్4న మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభతో పాటు.. వాషింగ్టన్, కాలిఫోర్నియాల్లో పలు కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

సత్యేంద్ర జైన్‌కు బెయిల్..

ఢిల్లీ లిక్కర్ టెండర్ల కేసులో అరెస్టై, జైలులో ఉన్న ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలులో ఉన్న సత్యేంద్ర జైన్ జారి పడటంతో గాయాలయ్యాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందున.. బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సత్యేంద్ర జైన్‌కు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైన్ అవసరం అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని కూడా చెప్పింది. జూలై 10 వరకు చికిత్సలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో మీడియాతో మాట్లాడవద్దని సత్యేంద్ర జైన్‌కు షరతు విధించింది.

First Published:  26 May 2023 3:35 PM IST
Next Story