అతనో మానవ మృగం.. చిన్నారులే టార్గెట్ - దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు.. రెండు వారాల్లో శిక్ష ఖరారు
2008 నుంచి 2015 మధ్యలో దాదాపు 30 మందిని ఈ విధంగా హతమార్చాడు. మృతిచెందిన చిన్నారులంతా 6 నుంచి 12 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం.
చిన్నారులే అతని టార్గెట్. ఏడేళ్ల కాలంలో ఏకంగా 30 మందిని హతమార్చాడు. అశ్లీల దృశ్యాలను చూడటం.. డ్రగ్స్ తీసుకోవడం అలవాటుగా మారి.. ఆ మత్తులో అర్ధరాత్రి వేళ చిన్నారుల కోసం గాలించేవాడు. దొరికినవారిని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగికంగా హింసించేవాడు. ఆ తర్వాత వారిని హతమార్చేవాడు. పోలీసులకు దొరకకూడదని.. ఇలా ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో ఈ దారుణాలకు పాల్పడేవాడు. ఎట్టకేలకు ఓ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయగా అతను చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
అతని పేరు రవీంద్రకుమార్.. సొంత ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంఝ్. అతనికి 18 ఏళ్ల వయసప్పుడే అతని కుటుంబం అక్కడి నుంచి ఉపాధి కోసం ఢిల్లీకి వలస వచ్చింది. తండ్రి ప్లంబర్ కాగా.. తల్లి పలు ఇళ్లలో పనిచేసేది. ఢిల్లీ వచ్చిన కొద్దిరోజులకే రవీంద్రకుమార్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత అశ్లీల చిత్రాలు చూడటం అలవాటుగా మారింది. రోజంతా కూలి పనులు చేసి సంపాదించిన సొమ్ముతో రాత్రివేళ డ్రగ్స్ తీసుకునేవాడు.
మురికివాడలో వారి కుటుంబం నివాసముంటుండగా, రాత్రి 8 గంటలకే రవీంద్ర నిద్రపోయేవాడు. అర్ధరాత్రి వేళ నిద్రలేచి చిన్న పిల్లలను వెతుకుతూ దగ్గరలోని నిర్మాణ ప్రదేశాలు, మురికివాడలకు వెళ్లేవాడు. ఆయా ప్రాంతాల్లో కనిపించిన చిన్నారులను నిద్రలో ఉండగానే నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై మానవ మృగంలా దురాగతానికి పాల్పడి హతమార్చేవాడు. 2008 నుంచి 2015 మధ్యలో దాదాపు 30 మందిని ఈ విధంగా హతమార్చాడు. మృతిచెందిన చిన్నారులంతా 6 నుంచి 12 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం.
బయటపడిందిలా..
2014లో జరిగిన ఓ హత్య కేసులో రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరేళ్ల పాపను హతమార్చి.. సెప్టిక్ ట్యాంకులోకి విసిరేసిన ఈ కేసులో పోలీసులు అతనిపై అనుమానంతో నిఘా ఉంచారు. విచారణలో అతనే ఈ హత్యకు పాల్పడ్డాడని ఆధారాలు లభించడంతో ఢిల్లీలోని సుఖ్‌బీర్‌నగర్ ప్రాంతంలో అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు మంగళవారం నాడు అతన్ని దోషిగా తేల్చింది. రెండు వారాల్లో శిక్ష ఖరారు చేయనున్నట్టు ప్రకటించింది.