Telugu Global
National

బీజేపీపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశారని ఆయన మండిపడ్డారు.

బీజేపీపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు
X

బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆశ చూపి కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. ఇటీవల బీజేపీ నేతలు తమ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను సంప్రదించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా.. ’కొద్ది రోజుల్లో కేజ్రీవాల్‌ అరెస్టు అవుతారు. ఎమ్మెల్యేలను విడగొట్టొచ్చు. 21 మందితో చర్చలు జరిపాం. మరికొంతమందితోనూ మాట్లాడాం. తర్వాత మేం ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా రావచ్చు. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయొచ్చు’ అని తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని ఆయన తెలిపారు.

తనను అరెస్టు చేసేది మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు కాదని దీనినిబట్టి అర్థమవుతోందని కేజ్రీవాల్‌ చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశారని ఆయన మండిపడ్డారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మద్దతు తమ పార్టీకేనని ఆయన స్పష్టంచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ని వారు తిరస్కరించారని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తెలిపారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఆయనకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా పంపించింది. ఈ విచారణలో భాగంగా కేజ్రీవాల్‌ని అరెస్ట్‌ చేసే అవకాశముందని ఆప్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడీ పంపే ఎలాంటి ప్రశ్నలకైనా తాను సమాధానం ఇవ్వడానికి సిద్ధమేనని చెబుతున్న కేజ్రీవాల్‌ విచారణకు మాత్రం హాజరుకావడం లేదు. ఈడీ నోటీసులకు ఆయన సమాధానం పంపుతూ.. ఈ కేసులో తనను విచారించడానికి గల నిజమైన ఉద్దేశం తెలపాలని పేర్కొన్నారు.

First Published:  27 Jan 2024 10:18 AM GMT
Next Story