Telugu Global
National

అన్నిట్లో తలదూర్చొద్దు.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ పై ఢిల్లీ సీఎం ఆగ్రహం

ఈరోజు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కార్యాలయంలో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, సీఎం కేజ్రీవాల్ మధ్య వాదోపవాదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఎల్జీ కార్యాలయంలో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్, ఆయన వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నిట్లో తలదూర్చొద్దు.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ పై ఢిల్లీ సీఎం ఆగ్రహం
X

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవాలనుకోవడం, విధానపరమైన నిర్ణయాల్లో కలుగజేసుకోవడం, కేంద్రానికి వత్తాసు పలకడం వంటి నిర్ణయాలతో గవర్నర్లు లక్ష్మణరేఖ దాటుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఎల్జీ కార్యాలయంలో వాడివేడి చర్చలు..

ఈరోజు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కార్యాలయంలో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, సీఎం కేజ్రీవాల్ మధ్య వాదోపవాదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఎల్జీ కార్యాలయంలో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్, ఆయన వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రాజ్ నివాస్ నుంచి కూడా ఓ ప్రకటన విడుదలైంది. ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎల్జీ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను కోరినట్లు రాజ్ నివాస్ అధికారులు పేర్కొన్నారు.

ఆ మూడే ఎల్జీ అధికారాలు..

ఢిల్లీలో పోలీస్‌, భూమి, పబ్లిక్ ఆర్డర్ అనే మూడు వ్యవహారాలు ఎల్జీకి రిజర్వ్ అయి ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం అన్ని ఇతర విషయాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుందని, రిజర్వ్ డ్ వ్యవహారాలు కాకుండా గవర్నర్ తీసుకునే ఇతర నిర్ణయాలన్నీ రాజ్యాంగ విరుద్ధమేనని అన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మొహల్లా క్లినిక్, జల్ బోర్డు చెల్లింపులను కూడా ఆయన నిలిపివేశారని ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన పనులు జరగాలంటే కాళ్లు పట్టుకోవాల్సి వస్తే తాను ఆ పని కూడా చేస్తానని, అవసరమైతే కోర్టుకైనా వెళ్తానని అన్నారు. ఎంతకైనా తెగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొన్ని నెలలుగా ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎల్జీ వినయ్ సక్సేనా జోక్యం విపరీతంగా పెరుగుతోందన్నారు. ఢిల్లీ ప్రజల అవసరాలు, కలలు నెరవేరడం లేదని, అందుకే తాను ఎల్జీని కలిశానన్నారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో అపార్థాలు ఉంటే పరిష్కరించుకోవచ్చనే ఉద్దేశంతోనే తాను ఆయన్ను కలిశానన్నారు. అయినా ఫలితం లేదన్నారు కేజ్రీవాల్.

First Published:  13 Jan 2023 10:08 PM IST
Next Story