ఢిల్లీలో వర్చువల్ స్కూల్.. దీని ప్రత్యేకతలివే..
ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి అనుబంధంగా ఈ స్కూల్ ఉంటుందని చెప్పారు. బుధవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 9నుంచి 12 తరగతుల వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. రెగ్యులర్ సిలబస్ తో పాటు జేఈఈ, నీట్ పరీక్షలకు కూడా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఇప్పటి వరకూ మనకు స్కూల్ అంటే బెల్ కొట్టడం, పుస్తకాల బ్యాగ్ తగిలించుకుని స్టూడెంట్స్ రావడం, ప్రార్థన, తరగతులు, ఇంటర్వెల్.. ఇదీ వ్యవహారం కానీ ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా వర్చువల్ స్కూల్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూల్ కేవలం ఆన్ లైన్లో మాత్రమే కనిపిస్తుంది. స్కూల్ కి వెళ్లి చదువుకునే అవకాశం లేనివారికి, నేరుగా తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు వినే సామర్థ్యం లేనివారికి ఇదో అద్భుత అవకాశం అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి అనుబంధంగా ఈ స్కూల్ ఉంటుందని చెప్పారు. బుధవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 9నుంచి 12 తరగతుల వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. రెగ్యులర్ సిలబస్ తో పాటు జేఈఈ, నీట్ పరీక్షలకు కూడా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్..
భారత్ లోనే ఇదే తొలి వర్చువల్ స్కూల్ అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. దేశంలోని ఏ ప్రాంతం విద్యార్థికయినా ఇక్కడ ప్రవేశం ఇస్తామని చెబుతున్నారు. వివిధ కారణాలతో బడికి వెళ్లలేని పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దేశ విద్యారంగంలోనే ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ ఓ మైలురాయి అని చెబుతున్నారు కేజ్రీవాల్.
ప్రత్యేకతలు..
ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ లో విద్యార్థులు లైవ్ క్లాస్ లకు హాజరు కావచ్చు. రికార్డ్ చేసిన పాఠాలు, స్టడీ మెటీరియల్ ని ఆన్ లైన్ లో పొందవచ్చు. దీనికి సంబంధించి విద్యార్థులకు ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. డిజిటల్ లైబ్రరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కరోనా టైమ్ లో నిర్వహించిన ఆన్ లైన్ క్లాస్ ల స్ఫూర్తితోనే వర్చువల్ స్కూల్ ప్రారంభించినట్టు తెలిపారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
విమర్శలు..
వర్చువల్ స్కూల్ దాదాపుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాంటిదే. ప్రస్తుతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఉంది, ఆ తర్వాత పై చదువులకు కూడా వివిధ యూనివర్శిటీలు దూరవిద్య ద్వారా కోర్సులను అందుబాటులో ఉంచాయి. వర్చువల్ స్కూల్ వీటికి ఏ విధంగా భిన్నంగా ఉంటుందని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు. అయితే ఓపెన్ స్కూల్స్ విషయంలో విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరని, కానీ ఢిల్లీ వర్చువల్ స్కూల్ లో మాత్రం ప్రతి విద్యార్థి ప్రతిభను అంచనా వేస్తామని, ఇబ్బడిముబ్బడిగా అడ్మిషన్లు ఇచ్చేసి ఈ కాన్సెప్ట్ ని దెబ్బతీయబోమని అంటున్నారు అధికారులు. ఓపెన్ స్కూల్ కి వర్చువల్ స్కూల్ కి తేడా చూపిస్తామంటున్నారు.