Telugu Global
National

క‌న్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్‌.. - సిసోడియాను త‌లుచుకొని భావోద్వేగం

స‌త్యం ఏనాడూ ఓడిపోద‌ని, ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ.. స‌మాజానికి మంచి చేయాల‌నుకున్న ఆయ‌న ఆశ‌యాల‌ను రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని కేజ్రీవాల్ చెప్పారు.

క‌న్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్‌.. - సిసోడియాను త‌లుచుకొని భావోద్వేగం
X

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. త‌మ పార్టీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాను గుర్తుచేసుకొని ఆయ‌న భావోద్వేగానికి గుర‌య్యారు. ఢిల్లీలోని బ‌వానాలో బీఆర్ అంబేడ్క‌ర్ స్కూల్ ఆఫ్ స్పెష‌లైజ్డ్ ఎక్స‌లెన్స్ కొత్త శాఖ‌ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న కంట‌త‌డి పెట్టారు. మ‌నీశ్ సిసోడియా దీనిని మొద‌లుపెట్టార‌ని, విద్యా శాఖ మంత్రిగా ఎన‌లేని సేవ‌లందించార‌ని తెలిపారు. ప్ర‌తి చిన్నారికీ మెరుగైన విద్య అందించాల‌న్న‌ది ఆయ‌న క‌ల అని, అందుకోసం విద్యా ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చ‌డం, పాఠ‌శాల‌ల‌ను మెరుగైన వ‌స‌తుల‌తో నిర్మించ‌డం వంటి ప్ర‌య‌త్నాలు చేశార‌ని చెప్పారు. అందుకేనేమో ఈరోజు ఆయ‌న్ని జైలులో పెట్టారంటూ కంట‌త‌డి పెట్టుకున్నారు.

త‌ప్పుడు కేసులు బ‌నాయించి మ‌నీశ్ సిసోడియాను జైలుకు పంపించార‌ని కేజ్రీవాల్ విమ‌ర్శించారు. స‌త్యం ఏనాడూ ఓడిపోద‌ని, ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ.. స‌మాజానికి మంచి చేయాల‌నుకున్న ఆయ‌న ఆశ‌యాల‌ను రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్ర‌భుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను అంతం చేయాల‌ని వారు కోరుకుంటున్నార‌ని, కానీ అలా జ‌ర‌గ‌నివ్వ‌బోమ‌ని కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మ‌నీశ్ సిసోడియాను విచార‌ణ కోసం పిలిపించిన సీబీఐ.. అటు నుంచి అటే ఆయ‌న్ని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించింది. మ‌ధ్య‌లో మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌ల‌పైనా ఈడీ విడిగా చార్జిషీట్ దాఖ‌లు చేసింది. ఈ కేసులో బెయిల్ కోరుతూ మ‌నీశ్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

First Published:  7 Jun 2023 8:19 PM IST
Next Story