అదే నిజమని తేలితే.. నన్ను బహిరంగంగా ఉరితీయండి.. - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయించి.. తనను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ చెప్పారు.
తనను దొంగ అని నిరూపించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు రుజువైనా తనను బహిరంగంగా ఉరి తీయాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. సీబీఐ, ఈడీ ఢిల్లీ మద్యం కేసులో విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పంజాబ్‌లో పర్యటించిన సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయించి.. తనను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ చెప్పారు. తానే అవినీతిపరుడినైతే.. ఈ ప్రపంచంలో నిజాయతీపరులెవరూ లేనట్టేనని స్పష్టం చేశారు. ఈ డ్రామాలను ఇప్పటికైనా ఆపాలని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. గత నెల 16న కేజ్రీవాల్‌ను సైతం సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
మణిపూర్‌లో ఒకపక్క పరిస్థితులు భగ్గుమంటున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. ఘర్షణలతో మణిపూర్ మండిపోతుంటే.. పరిస్థితులను చక్కదిద్దాల్సిన అక్కడి నేతలు కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని విమర్శించారు.