Telugu Global
National

కళ్లప్పగించి చూశారు.. ఆపే ప్రయత్నమే చేయలేదు.. బాలికను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడు

బాలికను చంపాలని ముందే నిర్ణయించుకున్న సాహిల్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 20 పోట్లు పొడిచాడు. అప్పటికీ ఆమె మృతి చెందిందో లేదోనన్న అనుమానంతో పక్కన ఉన్న పెద్ద బండరాయి తీసుకుని తలపై మోదాడు.

కళ్లప్పగించి చూశారు.. ఆపే ప్రయత్నమే చేయలేదు.. బాలికను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడు
X

అది ఢిల్లీలోని రోహిణి ప్రాంతం. అక్కడి షాబాద్ డెయిరీ వద్ద నిత్యం రద్దీగానే ఉంటుంది. అటువంటి ప్రాంతంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడు బాలికను దారుణంగా హత్య చేశాడు. కత్తితో 20 సార్లు పొడిచాడు. అప్పటికీ చావలేదేమోనన్న అనుమానంతో బండరాయి తీసుకుని తలపై మోదాడు. కళ్లెదుట ఇంత దారుణం జరుగుతున్నా.. జనం మాత్రం పట్టించుకోలేదు. కల్లప్పగించి చూస్తూ వెళ్లారేగానీ ఈ దారుణాన్ని ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.

రోహిణిలోని షాబాద్ డెయిరీ ప్రాంతానికి చెందిన పదహారేళ్ల బాలిక సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడితో స్నేహంగా ఉంటోంది. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు బాలిక ఇంట్లో నుంచి బయలుదేరింది. దారిలో ఆమెను సాహిల్ కలిశాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

బాలికను చంపాలని ముందే నిర్ణయించుకున్న సాహిల్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 20 పోట్లు పొడిచాడు. అప్పటికీ ఆమె మృతి చెందిందో లేదోనన్న అనుమానంతో పక్కన ఉన్న పెద్ద బండరాయి తీసుకుని తలపై మోదాడు. ఈ సంఘటన నడిరోడ్డుపై జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. నిందితుడు హత్య అనంతరం అక్కడి నుంచి తాపీగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న షాబాద్ డెయిరీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై ఢిల్లీ డీసీపీ సుమన్ నాల్వా మాట్లాడుతూ.. సాహిల్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామ‌ని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామ‌న్నారు. బాలిక హత్యపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నేరగాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని హద్దులను దాటేశారన్నారు. ఇటువంటి దారుణ ఘోరాన్ని ఇదివరకు తాను ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. కాగా, ఆ యువకుడు బాలికను హత్య చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

First Published:  29 May 2023 4:10 PM IST
Next Story