Telugu Global
National

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం ఒంటరిపోరు!

పొత్తుకు ససేమిరా అంటోన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం ఒంటరిపోరు!
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ససేమిరా అంటోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్‌ శుక్రవారం ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని.. ఒంటరిగానే 70 స్థానాలకు పోటీ చేస్తున్నామని వెల్లడించారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా రిలీజ్‌ చేయడం, పొత్తుపై కాంగ్రెస్‌ తో సంప్రదింపులకు సంసిద్ధంగా లేకపోవడంతోనే కాంగ్రెస్‌ ఒంటరిపోరుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌ పై విడుదలైన అర్వింద్‌ కేజ్రీవాల్‌ సీఎం ఆఫీస్‌ కు వెళ్లొద్దని, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని బెయిల్‌ నిబంధనల్లో ప్రతిబంధకాలు పెట్టారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ సీనియర్‌ నాయకురాలు అతిశీని సీఎం చేశారు. తాను సీఎంగా విధులు నిర్వర్తించాలో లేదో ప్రజల దగ్గరికే వెళ్లి తేల్చుకుంటానని కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందే ప్రకటించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తో పొత్తు పెట్టుకోకపోవడంతోనే కాంగ్రెస్‌ పార్టీ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరు ఆ పార్టీకి లాభం చేస్తుందా? చేటు తెస్తుందా అనేది చూడాల్సి ఉంది.

First Published:  29 Nov 2024 8:50 PM IST
Next Story