Telugu Global
National

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు ఢిల్లీ, కోల్‌కతా..

పట్టణాల్లో గాలి నాణ్యత, ఆరోగ్యం.. అనే నివేదిక కోసం ప్రపంచంలోని 7 వేల పట్టణాల్లో కాలుష్య వివరాలు సేకరించగా అందులో ఢిల్లీకి మొదటి స్థానం, కోల్‌కతాకు రెండో స్థానం దక్కాయి.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు ఢిల్లీ, కోల్‌కతా..
X

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల లిస్ట్‌లో ఢిల్లీ మొదటి ప్లేస్‌లో ఉండగా, కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. పర్టిక్యులేట్ మేటర్ ఎమిషన్ (కర్బన సహిత పదార్ధాల ఉద్గారాల) PM2.5 విడుదలలో ఢిల్లీ, కోల్‌కతా అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం గురించి అధ్యయనం చేస్తున్న అమెరికా సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. పట్టణాల్లో గాలి నాణ్యత, ఆరోగ్యం.. అనే నివేదిక కోసం ప్రపంచంలోని 7 వేల పట్టణాల్లో కాలుష్య వివరాలు సేకరించగా అందులో ఢిల్లీకి మొదటి స్థానం, కోల్‌కతాకు రెండో స్థానం దక్కాయి. 2010 నుంచి 2019 మధ్య కాలంలో సేకరించిన వివరాల ప్రకారం ఈ నివేదిక రూపొందించారు. ఢిల్లీలో PM2.5 వేల్యూ 110 మైక్రోగ్రామ్ పర్ క్యూబిట్ మీటర్‌గా ఉంది, కోల్‌కతాలో దాని విలువ 84 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్‌గా ఉంది.

NO2 విడుదలలో కాస్త మేలు..

గాలి నాణ్యత ఎలా ఉందని తెలుసుకోడానికి PM2.5 ఉద్గారాలతోపాటు, NO2 ఉద్గారాలను కూడా లెక్కలోకి తీసుకుంటారు. అయితే విచిత్రంగా NO2 విషయంలో భారత్‌లోని పట్టణాలేవీ ప్రమాదకర స్థాయిలో లేవు. PM2.5 ఉద్గారాల విషయంలో టాప్ 1, 2 స్థానాలు భారత్‌వే, కానీ NO2 ఉద్గారాల విషయంలో టాప్-20లో కూడా భారత్‌లోని పట్టణాలు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

పాత వాహనాలు లేకపోవడమే...

పాత వాహనాల వల్లే NO2 ఉద్గారాలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, ఇళ్లలో వంట చెరకు మండించడం ద్వారా వాతావరణంలో NO2 పరిణామం బాగా పెరుగుతుంది. ఈ విషయంలో ఇతర ప్రపంచ పట్టణాలతో పోల్చి చూస్తే భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉంది. షాంఘై ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. మాస్కో, బీజింగ్, ప్యారిస్, ఇస్తాంబుల్, సియోల్ నగరాల్లో NO2 ఉద్గారాల పరిణామం చాలా ఎక్కువ. మొత్తమ్మీద కాలుష్యం విషయంలో ప్రపంచంలోని 7 వేల పట్టణాల లిస్ట్ తీస్తే.. అందులో తొలి రెండు స్థానాల్లో ఢిల్లీ, కోల్‌కతా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

First Published:  18 Aug 2022 12:20 PM IST
Next Story