శిక్ష వేయడానికి మరణ వాంగ్మూలం ఒక్కటే చాలు.. - తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
22 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్‌ని ఆమె భర్తే హతమార్చగా.. అతనికి దిగువ కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది.
ఏదైనా కేసులో నేరం జరిగిందని కోర్టు విశ్వసించడానికి, ఆ కేసులో నిందితుడికి శిక్ష విధించడానికి మరణవాంగ్మూలం ఒక్కటే చాలని, దానికి వేరెవరి ధ్రువీకరణ అక్కర్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 22 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్‌ని ఆమె భర్తే హతమార్చగా.. అతనికి దిగువ కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. హంతకుడైన భర్త మాజీ సైనికోద్యోగి. హతురాలిని భర్త, మరిది, ఇతర బంధువులు నిత్యం వేధించేవారని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఈ వేధింపులు మరింత శ్రుతిమించి ఆమెను హతమార్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒకరోజు భర్త, మరిది హతురాలి కాళ్లు, చేతులు తువ్వాలుతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. తరువాత మరిది కిరోసిన్ సీసా, అగ్గిపెట్టె తీసుకురాగా భర్త ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పూర్తిగా ఒళ్లు కాలిన స్థితిలో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా, తన భర్తే ఘాతుకానికి పాల్పడ్డాడంటూ ఆమె తన మరణ వాంగ్మూలంలో పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఈ వివరాలను న్యాయస్థానం ముందు వివరించింది.
మృతురాలి మరణ వాంగ్మూలం ఆధారంగానే దిగువ కోర్టు 2008లో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. దీనిపై నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు కూడా నిర్ధారించింది. ఆపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అతను అప్పటికే తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఉన్నందున 2016లో బెయిల్ ఇచ్చింది. ఈ నెల 15న అతడిని రెండు వారాల్లో దిగువ కోర్టులో హాజరై శిక్ష కాలాన్ని పూర్తి చేయాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది.