Telugu Global
National

ఆన్ లైన్ మెడిసిన్స్.. అమెజాన్ సహా 12 కంపెనీలకు నోటీసులు

దేశవ్యాప్తంగా 12లక్షలమంది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ లు.. తమ యూనియన్ ద్వారా ఈనెల 15నుంచి ఆన్ లైన్ మెడిసిన్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.

ఆన్ లైన్ మెడిసిన్స్.. అమెజాన్ సహా 12 కంపెనీలకు నోటీసులు
X

ఆన్ లైన్ లో మందుల అమ్మకాలపై భారత్ లో ఆంక్షలున్నాయి. అయితే పరిమితంగా కొన్ని అత్యవసర మందుల్ని మాత్రం అమ్ముకోడానికి అనుమతులున్నాయి. కానీ ఆ వంకతో కొన్ని కంపెనీలు ఎడాపెడా మందుల్ని అమ్మేస్తున్నాయంటూ మందుల షాపులవాళ్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తీసుకున్న DCGI ఆన్ లైన్లో మందులు అమ్ముతున్న కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, టాటా 1ఎంజి సహా మొత్తం 12 ఇ-ఫార్మా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఆన్ లైన్ బిజినెస్ చేసే ఇతర సంస్థలు సంబంధిత లైసెన్స్ లు లేకుండా ఇలాంటి వ్యాపారం చేయకూడదని హెచ్చరించింది. దీనికి వెంటనే సమాధానం ఇవ్వాలని, లేకపోతే డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 15నుంచి నిరసనలు..

దేశవ్యాప్తంగా 12లక్షలమంది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ లు.. తమ యూనియన్ ద్వారా ఈనెల 15నుంచి ఆన్ లైన్ మెడిసిన్ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఆన్ లైన్ లో కొన్నిరకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండాలని, కానీ సదరు కంపెనీలు అన్ని రకాల మందుల్ని ఆన్ లైన్లో అమ్మేస్తున్నాయని, ఇది ప్రమాదకరమని చెబుతున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా జరిగే అమ్మకాలు కొన్నిసార్లు దుర్వినియోగం అవుతాయని, ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు రేట్ల విషయంలో కూడా చాలా తేడాలుంటున్నాయని, ఆఫర్లతో కస్టమర్లను మోసం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఆఫ్ లైన్ వర్సెస్ ఆన్ లైన్ పోరాటం ముందు ముందు ఎలా రూపు మార్చుకుంటుందో చూడాలి.

First Published:  11 Feb 2023 10:38 AM GMT
Next Story