Telugu Global
National

అమ్మకోసం ఐసీయూలో పెళ్లి చేసుకున్న కూతురు..

పెళ్లి బట్టల్లో ఉన్న కుమార్తె, అల్లుడిని చూసి పూనమ్ కళ్లు చెమర్చాయి. కూతురి పెళ్లి చూడలేననుకున్న తల్లి తృప్తిగా కన్నుమూసింది. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే పూనమ్ తుదిశ్వాస విడిచింది.

అమ్మకోసం ఐసీయూలో పెళ్లి చేసుకున్న కూతురు..
X

ప్రేమించినవారికోసం తల్లిదండ్రుల్ని వదిలేస్తున్న రోజులివి. పెద్దలు అడ్డు చెబుతారనే భయంతో పెళ్లి తర్వాత అసలు విషయం చెబుతున్న కాలం ఇది. ఇలాంటి రోజుల్లో తల్లికోసం ఓ కూతురు ఐసీయూలోనే పెళ్లి చేసుకుంది. ఆమె చివరి కోర్కెను తీర్చింది. కూతురు పెళ్లిని కళ్లారా చూసుకున్న ఆ తల్లి, ఆ తర్వాత రెండు గంటల్లోనే తనువు చాలించింది. తృప్తిగా కన్నుమూసింది.

బీహార్‌ లోని గయ జిల్లాలో ఓ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. మంగళ వాయిద్యాలు లేవు, కెమెరాల హడావిడి లేదు, బంధుమిత్రుల చదివింపులు, ఆశీర్వాదాలు కూడా లేవు. కేవలం తల్లి ఆశీర్వాదం కోసం ఆ కూతురు ఐసీయూలోనే పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయితో పాటు ఆమె మనసు అర్థం చేసుకున్న భర్తను కూడా పలువురు అభినందించారు. గయ జిల్లాలోని బాలి గ్రామానికి చెందిన లలన్‌ కుమార్‌ భార్య పూనమ్‌ వర్మ, కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతోంది. ఇటీవలే ఆమె కూతురికి పెళ్లి సంబంధం ఖాయం చేశారు. ఇంకా నిశ్చితార్థం కాలేదు. ఈ క్రమంలో పూనమ్ కు ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది. ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ బెడ్ పై ఆమె రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి. ప్రాణం దక్కదని వైద్యులు చెప్పారు. అయితే పూనమ్ స్పృహలోనే ఉన్నారు. తన కూతురు పెళ్లి తాను కళ్లారా చూసి చనిపోతానంటూ, తన చివరి కోర్కె తీర్చాలంటూ భర్తని ప్రాధేయపడింది.




అమ్మకోసం..

అమ్మ చనిపోతుందన్న బాధలో కూడా కూతురు పెళ్లి కూతురైంది, కాబోయే అల్లుడు కూడా ఐసీయూలో పెళ్లికి ఒప్పుకున్నాడు. దీంతో ఆస్పత్రి ఐసీయూలోనే వేదమంత్రాల సాక్షిగా పూనమ్ కుమార్తె చాందిని, సుమీత్ గౌర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి బట్టల్లో ఉన్న కుమార్తె, అల్లుడిని చూసి పూనమ్ కళ్లు చెమర్చాయి. కూతురి పెళ్లి చూడలేననుకున్న తల్లి తృప్తిగా కన్నుమూసింది. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే పూనమ్ తుదిశ్వాస విడిచింది. తల్లికోసం ఐసీయూలో పెళ్లి చేసుకున్ను కుమార్తె చాందిని, ఆమెకోసం కుటుంబ సభ్యుల్ని ఒప్పించిన అల్లుడు సుమీత్ గౌర్ ని అందరూ అభినందించారు. కలకాలం చల్లగా ఉండాలని దీవించారు.

First Published:  27 Dec 2022 8:25 AM IST
Next Story