Telugu Global
National

లోక్‌సభలో డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023... తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎంఐఎం, టీఎంసీ

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీఎంసీ ఎంపీ సుగతా రాయ్, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవలని కోరారు.

లోక్‌సభలో డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023... తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎంఐఎం, టీఎంసీ
X

డేటా ప్రొటెక్షన్ బిల్లు - 2023ను కేంద్ర కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత ఏడాదే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో అప్పుడు సదరు బిల్లును ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సవరణ చేసిన బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. కాగా, ఈ బిల్లును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీఎంసీ ఎంపీ సుగతా రాయ్, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవలని డిమాండ్ చేశారు. గతేడాది కూడా ఈ బిల్లును వ్యతిరేకించామని.. ఇప్పుడు సవరించిన బిల్లును ప్రవేశ పెట్టారని చెప్పారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు స్టాండింగ్ కమిటీకి స్కృూటినీ కోసం పంపించాలని వారు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఈ బిల్లు ప్రజల గోప్యతకు సంబంధించింది. కాబట్టి కేంద్రం తొందరపాటుగా పాస్ చేయాలనే ఆతృతను విడిచిపెట్టాలని సూచించారు. ఈ బిల్లుతో సమాచార హక్కు, ప్రైవసీ హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలు కోరుతున్నట్లు ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని.. లేదంటే లోక్‌సభలో చర్చకు అనుమతించాలని కోరారు.

కాగా, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కేవలం ద్రవ్య బిల్లు మాత్రమే అని.. అది ఒక సాధారణ బిల్లు అని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీని వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని పేర్కొన్నారు. ఈ బిల్లు అందరి వ్యక్తిగత హక్కులను కాపాడుతుందని.. వారి పర్సనల్ డేటాను న్యాయపరంగా మాత్రమే ఉపయోగించుకోవడానికి ఉద్దేశించిందని మంత్రి వైష్ణవ్ తెలిపారు.

అయితే విపక్షాలు మాత్రం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందడం లేదు. ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు - 2023 వల్ల కేంద్రానికి అపరిమితమైన అధికారాలు లభిస్తాయని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రయోజనార్థం పేరుతో సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను తమ ఇష్టానుసారం బ్లాక్ చేయడానికి కేంద్రానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆరోపిస్తున్నారు.

First Published:  3 Aug 2023 4:12 PM IST
Next Story