అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి నోటిలో మూత్రం పోసి…
కొన్ని నెలల క్రితం బాధిత మహిళ ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1500 అప్పుగా తీసుకుని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. అయితే తర్వాత ప్రమోద్ అదనపు వడ్డీ డబ్బులు ఇవ్వాలని కోరగా బాధితురాలు అందుకు నిరాకరించింది.
సభ్య సమాజం తలదించుకునేలా, మధ్ ప్రదేశ్‌లో జరిగిన మూత్ర విసర్జన ఘటన తరహా దారుణం బీహార్‌లో చోటు చేసుకుంది. రాజధాని పాట్నాకు సమీపంలో ఉన్న ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టారు. సెప్టెంబర్ 23వ తేదీ శనివారం రాత్రి గ్రామంలో దళిత మహిళను వారు కిడ్నాప్ చేశారు. ఆమెను దారుణంగా కొట్టి, వివస్త్రను చేసి శరీరంపైనా, నోట్లో మూత్రం పోశారు. నిందితుల నుంచి తప్పించుకున్న మహిళ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం…
కొన్ని నెలల క్రితం బాధిత మహిళ ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1500 అప్పుగా తీసుకుని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. అయితే తర్వాత ప్రమోద్ అదనపు వడ్డీ డబ్బులు ఇవ్వాలని కోరగా బాధితురాలు అందుకు నిరాకరించింది. అయినా అతను ఇంకా డబ్బులు ఇవాలంటూ ఇబ్బంది పెడుతూ ఉండటంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రమోద్ తనను వేధిస్తున్నాడని, బహిరంగంగా వివస్త్రగా ఊరేగింపు చేస్తానని బెదిరించాడని, ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రమోద్ సింగ్‌ను శనివారం విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లిన ప్రమోద్ తన మద్దతుదారుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఇంటికి తీసుకెళ్లి వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ప్రమోద్ సింగ్ తన కుమారుడి చేత మహిళ నోటిలో మూత్ర విసర్జన చేయించాడు. అయితే కొంతసేపటి తరువాత బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి వెళ్లింది. మరోసారి పోలీసులను ఆశ్రాయించింది. పోలీసులు ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరోవైపు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు వారిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.