Telugu Global
National

స్థిర, చరాస్తులు, బ్యాంక్ అకౌంట్ కూడా లేని అభ్యర్థి

తోటి కూలీలంతా కలసి చిల్లర నాణేలు సేకరించి మహేంద్ర భాయ్ పట్నీకి ఇచ్చారు. ఆయన వాటిని తీసుకెళ్లి నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.

స్థిర, చరాస్తులు, బ్యాంక్ అకౌంట్ కూడా లేని అభ్యర్థి
X

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఎన్ని చోట్ల ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్లు ఉన్నాయి, ఎన్ని కార్లున్నాయి. అకౌంట్లలో ఉన్నదెంత, అప్పులెన్ని.. ఇలాంటి లెక్కలన్నీ అఫిడవిట్ లో పొందుపరచాలి. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఓ అభ్యర్థి మాత్రం అసలు తనకు స్థిర, చరాస్తులు లేవంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. విచిత్రం ఏంటంటే అతనికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అయితే బ్యాంక్ అకౌంట్ లేకపోతే అఫిడవిట్ తీసుకోవడం కుదరదు అనేసరికి హడావిడిగా వెళ్లి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చారు గాంధీ నగర్ నార్త్ స్థానం నుంచి బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి మహేంద్ర భాయ్ పట్నీ.

డిపాజిట్ కూడా చిల్లర నాణేలే..

మహేంద్ర భాయ్ పట్నీ రోజు కూలీ. అతను డిపాజిట్ గా సమర్పించిన 10వేల రూపాయలు కూడా చిల్లర నాణేలే. అందులోనూ అవి అన్నీ ఒక రూపాయి నాణేలు కావడం విశేషం. తోటి కూలీలంతా కలసి చిల్లర సేకరించి మహేంద్ర భాయ్ పట్నీకి ఇచ్చారు. ఆయన వాటిని తీసుకెళ్లి నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.

ఎందుకంత కసి..?

అసెంబ్లీ ఎన్నికల్లో రోజు కూలీ బరిలో దిగారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. మహేంద్ర భాయ్ పట్నీ విషయంలో కూడా అలాంటి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. గాంధీనగర్‌ లోని మహాత్మా మందిర్‌ సమీపంలో మురికివాడలో నివాసం ఉండే మహేంద్రభాయ్‌ పట్నీతో పాటు మరికొంతమంది గుడిసెలను అధికారులు గతంలో రెండు సార్లు కూల్చివేశారు. 2010లో దండి కుటీర్‌ మ్యూజియం నిర్మాణం కోసం, 2019లో అక్కడ ఒక హోటల్‌ నిర్మాణం కోసం వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో నిరాశ్రయులైన 521 మంది హోటల్‌ సమీపంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకునే వారంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమ కష్టాలు తీర్చేందుకు తమ ప్రతినిధిగా ఇప్పుడు మహేంద్ర భాయ్ ని రంగంలోకి దింపారు.

రోడ్డునపడ్డ 521 కుటుంబాలకు న్యాయం చేసేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు మహేంద్ర భాయ్. ఇలాంటి కుటుంబాలు నియోజకవర్గ పరిధిలో చాలా ఉన్నాయని, తాను గెలిచి వారందరికీ న్యాయం చేస్తానంటున్నారాయన. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చి ఉంటే తాను ఎన్నికల్లో పోటీకి దిగేవాడినే కాదన్నారు. గాంధీనగర్‌ నార్త్ నియోజవర్గంలో మహేంద్ర భాయ్‌ తోపాటు మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

First Published:  19 Nov 2022 1:11 PM GMT
Next Story