పోలీసుల వలలో నరహంతక ముఠా.. - ఐదుగురు నిందితుల అరెస్ట్.. వారిపై 175 దోపిడీ కేసులు
మిగతావారితో కలిసి ఇక్కడ దోపిడీకి స్కెచ్ వేశాడు. ఖర్చుల కోసం పూణే వద్ద బంగారం దోపిడీ చేసి ఈ నెల 8న ఇక్కడికి చేరుకున్నారు. గుల్బర్గాకు చెందిన పప్పు యాదవ్ అనే వ్యక్తికి బంగారాన్ని లక్ష రూపాయలకు అమ్మేశారు.
నరహంతక ముఠా పోలీసుల వలకు చిక్కింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, దాదాపు వారంతా పాతికేళ్లలోపు వయసు వారే కావడం గమనార్హం. వీరందరిపై కలిపి 175 దోపిడీ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో దోపిడీలు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న వీరంతా.. ఇప్పుడు హైదరాబాద్‌లో దోపిడీకి స్కెచ్ వేశారు. ఒక్క రోజులో దోపిడీ చేస్తారనగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం నిందితుల వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో గల రామ్‌టేక్డీ ప్రాంతానికి చెందిన అమర్‌సింగ్ జగ్గర్‌సింగ్ (21), లక్కీసింగ్ గబ్బర్‌సింగ్ టక్ (20), నిహాల్‌సింగ్ మానవ్‌సింగ్ (18), నిషాంత్ (22), జీత్‌సింగ్ రాజ్‌పాల్‌సింగ్ (26) దోపిడీలే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. 2013 నుంచి మహారాష్ట్రలో నేరాలు చేస్తూ వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. నిహాల్ ఇటీవల జువైనల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు. అతనికి హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో తెలిసిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేవాడు.
మిగతావారితో కలిసి ఇక్కడ దోపిడీకి స్కెచ్ వేశాడు. ఖర్చుల కోసం పూణే వద్ద బంగారం దోపిడీ చేసి ఈ నెల 8న ఇక్కడికి చేరుకున్నారు. గుల్బర్గాకు చెందిన పప్పు యాదవ్ అనే వ్యక్తికి బంగారాన్ని లక్ష రూపాయలకు అమ్మేశారు.
షాపూర్ నగర్ పరిసరాల్లో బ్యాంకు, బంగారం దుకాణాల్లో చోరీకి రెక్కీ వేసి 11వ తేదీన దోపిడీ చేయాలని ప్లాన్ చేశారు. ఈ దోపిడీ కోసం నిహాల్, జీత్‌సింగ్ కలిసి ఈనెల 9న సంగారెడ్డి జిల్లాలో ఓ కారు కూడా కొట్టేశారు. స్థానికంగా వీరు అద్దెకు ఇల్లు తీసుకోగా, వీరి తీరుపై అనుమానంతో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వీరి కదలికలపై దృష్టిపెట్టిన జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ పవన్, ఎస్సై ఆంజనేయులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు ఆ ముఠాకు అవకాశం చిక్కలేదు.
పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులు తుపాకులు, బుల్లెట్లు, మారణాయుధాలు, దోపిడీకి ఉపయోగించే పరికరాలు కారు, రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో పూణే పోలీసులు వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, వారిపై ఈ ముఠా కాల్పులు జరపడం గమనార్హం. అక్కడ వీరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా ఉన్నారు.