హర్యానాపై పోస్ట్ మార్టం.. రెండు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్
ఎల్లుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వాకిట బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ పరాజయం పై పోస్టుమార్టానికి రెడీ అయ్యింది. హర్యానా ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులతో పాటు భాగస్వామ్య పార్టీలతో కలిసి మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో చర్చించనుంది. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాలు హర్యానాలో ఎందుకు సాధించలేకపోయారు.. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎందుకు బాహాటంగా అసహనం వ్యక్తం చేశాయి.. రాబోయే ఎన్నికలతో పాటు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై హస్తం పార్టీ ఫోకస్ చేస్తోంది. ఈ అన్ని అంశాలపై చర్చించేందుకు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుంది. సీడబ్ల్యూసీ మీటింగ్ లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా వర్కింగ్ కమిటీ సభ్యులు, స్పెషల్ ఇన్వైటీస్ హాజరుకానున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వాయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మొదటిసారి దిగుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వాయనాడ్ స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని సానుకూలతలు ఉన్నా.. ఆ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ హై కమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాయనాడ్ స్థానానికి ఉప ఎన్నికపైనా వర్కింగ్ కమిటీలో చర్చ జరుగనున్నట్టు సమాచారం.
ఇండియా కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో అందరి అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో చతికిల పడిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో సెంచరీ మార్క్ కు ఒక సీటు దూరంలో ఆగిపోయింది. దేశంలో నరేంద్రమోదీ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ ఈ ఎన్నికలతో ఎమర్జ్ అయ్యారు. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. హర్యానా అసెంబ్లీలో రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతున్నట్టు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. కానీ ఫలితాలు రివర్స్ అయ్యాయి. 0.90 శాతం ఓట్ల తేడాతో బీజేపీ మరోసారి అధికార పీఠం దక్కించుకుంది. హర్యానాలో హ్యాట్రిక్ విజయంతో బీజేపీలో ఉత్సాహం పెరిగింది. మహారాష్ట్రలో మహయుతి సంకీర్ణ ప్రభుత్వం (బీజేపీ, శివసేన (షిందే), ఎన్‌సీపీ (అజిత్ పవార్)పైనా ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్), శివసేన (బాలసాహెబ్)లతో కూడిన మహావికాస్ అఘాడి కూటమి 30 ఎంపీ సీట్లు గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని తలకిందులు చేయాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. హర్యానా ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏకపక్ష వైఖరితోనే కాంగ్రెస్ ఓడిపోయిందని ఇండియా కూటమిలోనే పార్టీలు ఆరోపణలు చేశాయి. జార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉంది. జార్ఖండ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, మహారాష్ట్రలో భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హర్యానా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే మోదీని గద్దె దించడం సాధ్యం కాదని ఇండియా కూటమిలోని పార్టీలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతోన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.