ఏటీఎంలో చోరీకి యత్నం.. డబ్బంతా దగ్ధం
దుండగుల చర్యను సీసీ టీవీ ద్వారా గమనించిన ముంబైలోని బ్యాంకు సిబ్బంది.. సత్వరం స్పందించి.. ఏటీఎం ఉన్న భవన యజమానికి సమాచారం అందించారు.
ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలో చోరీకి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పాటు అందులోని సొమ్మంతా కాలిపోయింది. ఏటీఎంను పగలగొట్టేందుకు నిందితులు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు శివారులోని నేలమంగళ ప్రాంతంలో ఓ ఏటీఎం సెంటర్‌లోకి బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఏటీఎంలోని సొమ్మును కాజేసేందుకు గ్యాస్ కట్టర్‌తో దానిని పగలగొట్టే ప్రయత్నించారు. దుండగుల చర్యను సీసీ టీవీ ద్వారా గమనించిన ముంబైలోని బ్యాంకు సిబ్బంది.. సత్వరం స్పందించి.. ఏటీఎం ఉన్న భవన యజమానికి సమాచారం అందించారు. వెంటనే ఆయన ఏటీఎం దగ్గరకు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో వారు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్, ఇతర పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపోయారు.
ఈ సమాచారం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది అక్కడికి చేరుకొని ఏటీఎంను తెరిచి చూడగా, అందులోని నోట్లలో చాలావరకు కాలిపోయాయి. కాలిపోయిన నోట్ల విలువ రూ.7 లక్షలు ఉంటుందని సమాచారం. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.