Telugu Global
National

కాశీ ఆలయంలో అర్చకుల గెటప్‌లో పోలీసులు.. యోగి సర్కార్‌పై విమర్శలు

పోలీసులు అర్చకుల్లా దుస్తులు ధరించడంపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాశీ ఆలయంలో అర్చకుల గెటప్‌లో పోలీసులు.. యోగి సర్కార్‌పై విమర్శలు
X

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు అయితే సంచలనమో, లేకపోతే వివాదాస్పదమో అవుతూనే ఉన్నాయి. యోగి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రశంసలు ఎన్ని వస్తున్నాయో తెలియదు కానీ.. విమర్శలు మాత్రం భారీగానే వస్తున్నాయి. తాజాగా యోగి సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం మరొకసారి వివాదాస్పదం అయింది. వారణాసిలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసులకు ప్రభుత్వం డ్రెస్ కోడ్ ప్రకటించింది. అయితే పోలీసులు విధుల్లో ధరించే ఖాకీ దుస్తులకు బదులుగా ధోతీ - కుర్తా ధరించాలని సూచించడం వివాదాస్పదంగా మారింది.

ఈ దుస్తులతోపాటు పోలీసులు మెడలో రుద్రాక్షలు కూడా ధరించాలని సూచించడం, డ్రెస్ కోడ్ అయిన ధోతీ - కుర్తా రంగు కాషాయ రంగులా కనిపిస్తుండడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాశీ ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసులు ఇక నుంచి ధోతీ - కుర్తా ధరించి రావాలని ఇటీవల వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు ధోతీ - కుర్తా ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకొని ఆలయం వద్ద విధులకు హాజరవుతున్నారు.

పోలీసులు ధరించిన సంప్రదాయ దుస్తులు అర్చకులు ధరించే దుస్తులు పోలి ఉండటంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆలయం వద్ద విధులు నిర్వహించేవారు పోలీసులా? అర్చకులా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. పోలీసులు అర్చకుల్లా దుస్తులు ధరించడంపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలీసులు అర్చకుల్లా దుస్తులు ధరించాలని ఏ మ్యాన్యువల్‌లో ఉందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల్లా ధోతీ - కుర్తా ధరించి ఎవరైనా ప్రజలను మోసగిస్తే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు.

ఆలయం వద్ద పోలీస్ డ్రెస్ కోడ్‌పై భక్తుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ మాత్రం సమర్థించుకున్నారు. భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్నిసార్లు పోలీసులు వ్యవహరించే తీరు ప్రజలను బాధిస్తుంటుందని, అదే పోలీసులు అర్చకుల్లా కనిపిస్తుంటే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పోలీసులకు డ్రెస్ కోడ్ మార్చినట్లు ఆయన తెలిపారు.

First Published:  12 April 2024 9:19 PM IST
Next Story