పొలిటికల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధనాధన్ యూసుఫ్ పఠాన్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ఈ ఎన్నికల్లో బహరామ్‌పూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ.
విపక్ష ఇండియా కూటమిలో ఉన్నామంటూనే టీఎంసీ అధినేత బెంగాల్‌లో అన్ని పార్లమెంట్ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేశారు. మొత్తం 42 స్థానాలకూ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అంతేకాదు ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ప్రచారానికి ఆదివారం నుంచి శ్రీకారం కూడా చుట్టేశారు. టీఎంసీ జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్‌కు చోటు దక్కింది.
బహరాన్‌పూర్ నుంచి యూసుఫ్ పఠాన్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ఈ ఎన్నికల్లో బహరామ్‌పూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన యూసుఫ్ పఠాన్ తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి బరోడా రంజీ టీమ్‌లో ఆడాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్‌గా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 57 వన్డేలు, 22 టీ20లు జాతీయ జట్టు తరఫున ఆడాడు. 9వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చి సెంచరీచేసి జట్టును గెలిపించిన రికార్డు ఉంది. 33 వికెట్లు కూడా తీశాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌తో ఫేమస్
ఐపీఎల్ తొలి రోజుల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ధనాధన్ ఆటతీరుతో జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వచ్చి ఆ జట్టు తొలిసారి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతాకు ఆడి బాగా ఫేమస్ అయ్యాడు యూసుఫ్. అధిర్ రంజన్ చౌదరి లాంటి సీనియర్ నేతను గెలవాలంటే పార్టీ బలంతోపాటు క్రికెట్ గ్లామర్ కూడా కలిసొస్తుందని యూసుఫ్ ను బరిలోకి దించారు మమత.