Credit card | బీ అలర్ట్.. ! మూడో వంతు పెరిగిన క్రెడిట్ కార్డు బకాయిలు.. ఆ బ్యాంకుల్లోనే ఎక్కువ..?!
Credit card | గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డుల బిల్లు బకాయిలు మూడో వంతు పెరిగాయి. విదేశీ, ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డుల బిల్లు బకాయిలే ఎక్కువ.
Credit card | గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు క్రెడిట్ కార్డు కలిగి ఉన్నాడు. ఒక్కోసారి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో మనీ ఉండకపోవచ్చు. కానీ, క్రెడిట్ కార్డు ఉంటే మనకు అత్యవసర వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ, 50 రోజుల్లోపు ఆ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలి. గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. వాటితోపాటు క్రెడిట్ కార్డు బిల్లుల బకాయిలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ) రూ.951 కోట్లు పెరిగాయి. 2021-22లో క్రెడిట్ కార్డు బిల్లుల్లో మొండి బకాయిలు రూ.3,122 కోట్లే. 2022 మార్చి నుంచి 2023 మార్చి నెలాఖరు వరకూ రూ.951 కోట్ల మేరకు క్రెడిట్ కార్డ్ బిల్లులు పేరుకుపోయాయి. అంటే 30.5 శాతం క్రెడిట్ కార్డు బిల్లుల బకాయిలు పెరిగిపోయాయని సాక్షాత్తు ఆర్బీఐ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన ఆర్బీఐ ఈ సంగతి చెప్పింది.
2022 డిసెంబర్ నెలాఖరు నాటికి స్థూల క్రెడిట్ కార్డు బిల్లులు రూ.3,887 కోట్లు. అంటే 2023 జనవరి నుంచి మార్చి వరకు మరో రూ.186 కోట్ల మేరకు క్రెడిట్ కార్డు ఖాతాదారుల బిల్లులు మొండి బకాయిలుగా మారాయని ఆర్బీఐ పేర్కొంది. క్రెడిట్ కార్డు బకాయి బిల్లుల్లోనూ అదే పురోగతి కనిపిస్తున్నది. 2022 మార్చి నెలాఖరు నాటికి రూ.1.48 లక్షల కోట్లు ఉంటే, 2023 మార్చి నాటికి రూ.1.94 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. 2021-22లో 7.52 కోట్ల క్రెడిట్ కార్డులు ఉంటే, 2022-23లో 8.53 కోట్లకు పెరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల స్థూల మొండి బకాయిల నిష్పత్తి 2.02 శాతం మాత్రమేనని ఆర్బీఐ తెలిపింది. ఓవరాల్‌గా వ్యక్తిగత రుణాల వసూళ్లలో పెరుగుదల కనిపిస్తున్నా, క్రెడిట్ కార్డు బిల్లుల వసూళ్లలో మోస్తరుగా బలహీనతలు ఉన్నాయని పేర్కొన్నది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల్లో స్థూల మొండి బకాయిలు 18 శాతం ఉంటే, ప్రైవేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఎన్‌పీఏలు 1.9 శాతం, విదేశీ బ్యాంకుల క్రెడిట్ కార్డు ఎన్‌పీఏలు 1.8 శాతమే. క్రెడిట్ కార్డుపై రుణాలు రూ.50 వేల లోపేనని బ్యాంకర్లు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డుల యూజర్లకు ప్రతి నెలా నిర్దేశిత గడువు తేదీ లోపు స్టేట్‌మెంట్ వస్తుంది. స్టేట్‌మెంట్ వచ్చిన 20 రోజుల్లోపు పూర్తిగా గానీ, కనీస మొత్తం బిల్లు కానీ పే చేయడానికి సంబంధిత బ్యాంకులు అనుమతి ఇస్తున్నాయి. పూర్తి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే సరి.. కనీస మొత్తం బిల్లు చెల్లిస్తే.. మిగతా మొత్తం తదుపరి నెలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ కార్డు బిల్లు బకాయిలపై బ్యాంకులు 38 నుంచి 42 శాతం వడ్డీ వసూలు చేస్తాయి.
క్రెడిట్ కార్డు బిల్లు స్టేట్‌మెంట్ వచ్చిన తర్వాత 90 రోజుల్లోపు కనీస మొత్తం బిల్లు చెల్లించకపోతే సదరు క్రెడిట్ కార్డు ఖాతాను మొండి బకాయిగా బ్యాంకులు పరిగణిస్తాయి. క్రెడిట్ కార్డు ఖాతాదారుడి సిబిల్ స్కోర్ (క్రెడిట్ రేటింగ్ పరపతి) పడిపోతూ ఉంటుంది. 2023 మార్చి నెలాఖరు నాటికి అన్ సెక్యూర్డ్ రుణాలు 22.9 నుంచి 25.2 శాతానికి పెరిగితే, సెక్యూర్డ్ లోన్లు 77.1 నుంచి 74.8 శాతానికి పడిపోయాయి.
క్రెడిట్ కార్డు, అన్ సెక్యూర్డ్ రుణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక హెచ్చరికలు చేసింది. ఈ సెగ్మెంట్ల ఖాతాదారులకు రుణాలిస్తున్నప్పుడు ఆచితూచి స్పందించాలని బ్యాంకులను హెచ్చరించింది. అన్ సెక్యూర్డ్ లోన్ ఎటువంటి తాకట్టు లేదా సెక్యూరిటీ లేకుండా మంజూరు చేసే రుణం. రుణ గ్రహీతల రుణ పరపతి సామర్థ్యం ఆధారంగానే ఈ రుణాలు మంజూరు చేస్తాయి బ్యాంకులు. ఎటువంటి తాకట్టు లేదా సెక్యూరిటీ లేని అన్ సెక్యూర్డ్ రుణాలు డీఫాల్ట్ అయితే బ్యాంకుల ఆస్తుల నాణ్యత ప్రమాదంలో చిక్కుకుంటుంది.
*