అదానీకి మద్దతుగా చేతులు కలిపిన సీపీఎం,బీజేపీ,కాంగ్రెస్
కేరళలోని తిరువనంతపురం సమీపంలో అదానీ నిర్మిస్తున్న పోర్టుకు వ్యతిరేకంగా స్థానికులు తిరగబడుతుంటే, అదానీకి మద్దతుగా సీపీఎం, బీజేపీలు చేతులు కలిపాయి. ఆ రెండు పార్టీలు కలిపి నిన్న తిరువనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించాయి.
కేరళలో అదానీ ప్రయోజనాలను కాపాడటానికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం, కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీలు కలిసికట్టుగా నడుం భిగించాయి.
కేరళలోని తిరువనంతపురం సమీపంలో అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజింజం పోర్టు కు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. కొంత కాలంగా స్థానిక మత్సకారులు అనేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 వతేదీ, మంగళవారం నాడు మత్స్యకారులు వేలాది మంది రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ మత్సకారులను ఎదుర్కొని అదానీ ప్రయోజనాలను కాపాడటానికి సీపీఎం, బీజేపీలు చేతులు కలిపాయి. వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తోడయ్యారు. అదానీ పోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మత్సకారులకు వ్యతిరేకంగా ఈ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ర్యాలీ నిర్వహించారు. సైద్దాంతికంగా తూర్పు పడమరలైన సీపీఎం, బీజేపీలు అదానీ కోసం చేతులు కలపడాన్ని ప్రజలు వింతగా చర్చించుకుంటున్నారు.
బీజేపీ, సీపీఎం అద్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అనవూరు నాగప్పన్ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వి.వి. రాజేష్ లు ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు ప్రసంగాలు ఇవ్వనప్పటికీ పలువురు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఓడరేవుకు వ్యతిరేకంగా జరుగుతున్న మత్సకారుల ఆందోళనలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన 'సేవ్ విజింజం పోర్ట్ యాక్షన్ కౌన్సిల్' ఆధ్వర్యంలో ఈ మార్చ్ జరిగింది.
కేరళలో బీజేపీ, సీపీఐ(ఎం) రాజకీయ నాయకులు బహిరంగ వేదికపై ఏకం కావడం ఇదే తొలిసారి.
సీపీఎం నేత నాగప్పన్, బీజేపీ నేత రాజేష్ లు ఇద్దరూ ఓడరేవు ప్రణాళిక ఫలవంతం అయ్యేలా చూసేందుకు తమ పార్టీలు 'సేవ్ విజింజం పోర్ట్ యాక్షన్ కౌన్సిల్' కు మద్దతు ఇస్తాయని చెప్పారు. నిరసనలు చేస్తున్న మత్సకారులకు నిగూఢ ఉద్దేశాలున్నాయని సీపీఎం నేత నాగప్పన్ ఈ సందర్భంగా ఆరోపించారు.
పోర్ట్ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయడం, ఈ పోర్ట్ వల్ల తీరప్రాంతం మీద పడే ప్రభావం పై అధ్యయనం చేయడం తదితర ఏడు డిమాండ్ల కోసం వేలాది మంది స్థానిక మత్సకారులు ఉద్యమిస్తున్నారు. విజింజం ఓడరేవులో భాగంగా అశాస్త్రీయంగా నిర్మించిన గ్రోయిన్‌లు, కృత్రిమ సముద్ర గోడల వల్ల తీరం కోతకు గురవుతోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
మరో వైపు నిర్మాణంలో ఉన్న ఓడరేవు రహదారిపై నిరసనకారులు ఉంచిన అడ్డంకులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.అదానీ గ్రూప్ హైకోర్టులో వేసిన ధిక్కార పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ అను శివరామన్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
మొత్తానికి ఎన్నడూ కలవని విరుద్ద శక్తులను, శతృవులను అదానీ కలిపాడన్న వ్యాఖ్యలు కేరళలో వినిపిస్తున్నాయి.