Telugu Global
National

ఈడీ, బీజేపీ లింక్ లు బట్టబయలు...వీడియో లీక్ పై ఈడీకి కోర్టు నోటీసులు

తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత , మాజీమంత్రి సత్యేందర్ జైన్ కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ ఈడీ కోర్టుకు సాక్ష్యంగా కొన్ని వీడియోలను సమర్పించింది. ఆ వీడియోలను బీజేపీ బహిర్గతం చేసింది.

ఈడీ, బీజేపీ లింక్ లు బట్టబయలు...వీడియో లీక్ పై ఈడీకి కోర్టు నోటీసులు
X

కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ సమర్పించిన వీడియోలను బిజెపి విడుదల చేయడం పట్ల ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ కి కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది కోర్టు.

మనీలాండరింగ్ ఆరోపణలపై గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత , మాజీమంత్రి సత్యేందర్ జైన్ కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ ఈడీ కోర్టుకు సాక్ష్యంగా కొన్ని వీడియోలను సమర్పించింది. ఆ సందర్భంగా ఈ వీడియోలతో సహా కేసుకు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా మీడియాకు వెల్లడించబోమని కోర్టులో హామీ ఇచ్చింది. అయితే అవే వీడియోలు బీజేపీ బహిర్గతం చేసింది.

సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న ఆ వీడియోలు బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ CCTV ఫుటేజీని లీక్ చేసిందని ఆరోపిస్తూ, EDపై ధిక్కార చర్యలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా కోర్టు ఈడీకి నోటీసు ఇచ్చింది.

కాగా బీజేపీ చేసిన వీఐపీ ట్రీట్‌మెంట్ ఆరోపణలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురుదాడి చేసింది, మంత్రి అస్వస్థతతో ఉన్నారని, ఫిజియోథెరపీ తీసుకుంటున్నారని, విలాసవంతమైన మసాజ్ కాదని చెప్పారు.

"అతని (సత్యేందర్ జైన్) వెన్నెముకకు గాయమైనట్లు రికార్డ్ చేయబడింది. అది అతని నరాలను ఛిద్రం చేసింది. అందుకే అత్న్ని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత అతనికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి" అని ఆప్ నేత‌ సిసోడియా చెప్పారు. డాక్టర్, జైన్ కు సాధారణ ఫిజియోథెరపీని సూచించాడు. "అలాంటి పరిస్థితిలో, మీరు (బిజెపి) అతని వీడియో తీసి అతనిని ఎగతాళి చేస్తారా ? మీకు సిగ్గు లేదా?" అని సిసోడియా మండిపడ్డారు.

గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఈ వీడియోను విడుదల చేసిందని సిసోడియా ఆరోపించారు.

First Published:  19 Nov 2022 9:09 PM IST
Next Story