Telugu Global
National

పిచ్చి పీక్స్ కి.. 'లియో' థియేటర్‌లో దండలు, ఉంగ‌రాలు మార్చుకున్న కాబోయే జంట

పుదుకుట్టై జిల్లాకు చెందిన వెంకటేష్, మంజుల హీరో విజయ్‌కి వీరాభిమానులు. ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి మాత్రం విజయ్ హీరోగా నటించిన లియో విడుదల తర్వాతే చేసుకోవాలని ఆ జంట నిర్ణయించుకుంది.

పిచ్చి పీక్స్ కి.. లియో థియేటర్‌లో దండలు, ఉంగ‌రాలు మార్చుకున్న కాబోయే జంట
X

కాలం మారే కొద్ది సాంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి. ఇప్పటి యువత అనుసరిస్తున్న వైఖరి అంతుబట్టని విధంగా మారిపోతోంది. సెల్ఫీ కోసం కొండ అంచున, వేగంగా వచ్చే ట్రైన్ ముందు నిలబడి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ.. యువత చేస్తున్న పిచ్చి పనులు ఇటీవల వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు తమిళనాడులో కాబోయే ఓ జంట లియో ప్రదర్శితమవుతున్న థియేటర్‌కు వచ్చి దండలు, ఉంగరం మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంత అభిమానం ఉంటే ఏంటీ.. సాంప్రదాయాలు పాటించరా..? అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన లియో సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా సందడి నెలకొంది. విజయ్ అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. డప్పు చప్పుళ్ళు, టపాసుల మోతతో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓ కాబోయే జంట లియో ప్రదర్శితమవుతున్న థియేటర్‌కు వచ్చి దండలు, రింగులు మార్చుకుంది.


పుదుకుట్టై జిల్లాకు చెందిన వెంకటేష్, మంజుల హీరో విజయ్‌కి వీరాభిమానులు. ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి మాత్రం విజయ్ హీరోగా నటించిన లియో విడుదల తర్వాతే చేసుకోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఇందుకోసం ఎనిమిది నెలలుగా వారు వేచి చూస్తున్నారు. ఇవాళ లియో విడుదల కాగా.. తర్వాతి రోజైన అక్టోబర్ 20న వివాహం జ‌రుపుకోనున్నారు.

లియో సినిమా బెనిఫిట్ షోకు కాబోయే వధూవరులు సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు. బంధువులు, స్నేహితుల మధ్య దండలు వేసుకుని, ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత బంధువులతో కలిసి సినిమా వీక్షించారు. కాబోయే జంట థియేటర్ కు వచ్చి ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  19 Oct 2023 1:12 PM IST
Next Story