Telugu Global
National

గుట్టలుగా డబ్బుతో పట్టుబడ్డ ఎమ్మెల్యేకు బెయిల్... పటాసులు పేలుస్తూ గ్రాండ్ వెల్కం చెప్పిన బీజేపీ కార్యకర్తలు

కోర్టు విరూపాక్షప్ప కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన ఆయన ఇంటికి వస్తుండగా వేలాదిగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపిస్తూ, పటాసులు పేలుస్తూ, డ్యాన్సులు చేస్తూ....ఆయనను ఊరేగింపుగా ఇంటి దాకా తీసుకెళ్ళారు.

గుట్టలుగా డబ్బుతో పట్టుబడ్డ ఎమ్మెల్యేకు బెయిల్... పటాసులు పేలుస్తూ గ్రాండ్ వెల్కం చెప్పిన బీజేపీ కార్యకర్తలు
X

ముందుగా మూడు రోజుల కింద జరిగిన కథ:

కర్నాటక‌లో బీజేపీ ఎమ్మెల్యే, కర్నాటక సోప్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) చైర్మన్ మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతను కర్నాటక సోప్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్)కి ముడి సరుకుల కేటాయింపు కోసం రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డాడు. అతన్ని అరెస్టు చేసిన అధికారులు అతని ఇంటిపై, అతని తండ్రి ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఇంటిపై దాడి చేశారు. ఆ దాడిలో విరూపాక్షప్ప ఇంట్లో గుట్టలుగా ఉన్న డబ్బు కట్టలు చూసి అధికారులే షాక్ అయ్యారు. అధికారులు వారి ఇళ్ళలో నుండి రూ.8.1 కోట్ల నగదు, 1.6 కిలోల బంగారాన్ని స్వాధీన‍ం చేసుకున్నారు.

విరూపాక్షప్ప కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో ఆయన కర్నాటక సోప్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. లోకాయుక్త అతనిపై కూడా కేసు నమోదు చేసింది. అతన్నికూడా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో విరూపక్షప్ప ముందస్తు బెయిల్ కు అప్లై చేశారు.

ఇక ఈ రోజు కథ:

కోర్టు విరూపాక్షప్ప కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన ఆయన ఇంటికి వస్తుండగా వేలాదిగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపిస్తూ, పటాసులు పేలుస్తూ, డ్యాన్సులు చేస్తూ....ఆయనను ఊరేగింపుగా ఇంటి దాకా తీసుకెళ్ళారు. వేలాదిమంది మధ్య ఆయన కారుపై నిలబడి చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందిస్తూ సాగిపోయారు. ఓ అవినీతి కేసులో బెయిల్ పొందిన వ్యక్తిని , స్వాతంత్య్ర సమరయోధుడి మాదిరిగా ఊరేగిస్తూ తీసుకెళ్ళడం చూసిన జనం విస్తుపోయారు.

ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజనులు కొందరు వ్యంగ్యంగా, కొందరు ఆగ్రహంగా స్పందించారు. ''లంచం కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులపై ప్రజలు పూల వర్షం కురిపించే ఇలాంటి సంఘటన‌లు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయో లేదో తెలియదు. మన‌ చర్మం చాలా మందం '' అని ఓ నెటిజన్ స్పందించగా, ''ఇంత పెద్ద గుంపును తీసుకరావడానికి వాళ్ళు పెట్టిన ఖర్చు ఆ తండ్రీ కొడుకుల ద్వయం సంపాదించిన దాంట్లో చాలా తక్కువే'' అనిమరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మరో వైపు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అవినీతికి నిరసనగా మార్చి 9న రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.


First Published:  7 March 2023 4:17 PM GMT
Next Story