మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కూడా మళ్లీ పట్టాలెక్కింది. సోమవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు చెన్నై రైల్వే స్టేషన్ నుంచి షాలిమార్ వైపుగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది.
ఒడిశా రాష్ట్రం బాలసోర్ వద్ద శుక్రవారం కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ ట్రైన్, హౌరా ఎక్స్ ప్రెస్ లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 275 మంది చనిపోయారు. ఇంకా వందలాది మంది పరిస్థితి విషమంగానే ఉంది. కాగా మూడు రైళ్లు ఢీకొనడంతో బాలసోర్ వద్ద ప్రమాదస్థలిలో రైలు బోగీలు చెల్లాచెదురయ్యాయి. పట్టాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రైల్వే అధికారులు వందలాది మంది సిబ్బందితో భారీ యంత్రాలను ఉపయోగించి పడిపోయిన రైలు బోగీలను పట్టాల పైనుంచి తొలగించారు. ధ్వంసమైన ట్రాక్ ను పునరుద్ధరించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పగలు, రాత్రి కష్టపడి ట్రాక్ ని సిద్ధం చేశారు. ట్రాక్ కు మరమ్మతులు పూర్తి కావడంతో ఆ మార్గంలో మళ్లీ రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కూడా మళ్లీ పట్టాలెక్కింది. సోమవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు చెన్నై రైల్వే స్టేషన్ నుంచి షాలిమార్ వైపుగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. మంగళవారం ఉదయం ఈ ట్రైన్ బాలసోర్ మీదుగా షాలిమార్ చేరుకుంది. బాలసోర్ వద్ద రైళ్లు ఢీకొని పట్టాలన్నీ ధ్వంసం కావడంతో చెన్నై నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపుగా వెళ్లే పలు రైళ్ల సేవలను అధికారులు రద్దు చేశారు. ఇప్పుడు బాలసోర్ వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను బాగు చేయడంతో చెన్నై నుంచి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే పలు రైళ్ల సేవలను సోమవారం పునరుద్ధరించారు.