దోషి అని తేలగానే కోర్టు ఆర్డర్ తో పరారైన యూపీ మంత్రి
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి ఆయుధాల కేసులో దోషి అని కోర్టు తేల్చింది. అప్పటి దాకా కోర్టులోనే ఉన్న ఆ మంత్రి న్యాయమూర్తి తీర్పు చదువుతుండగానే పారిపోయాడు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ప్రతిష్ట మసక బారింది. ఆయన సొంత కేబినెట్ లోని మంత్రే దొంగలా పారిపోయాడు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖతోబాటు ఖాదీ డిపార్ట్మెంట్ వ్యవహారాలను కూడా చూసే రాకేష్ సచన్ నిర్వాకమిది.. ఆయుధాల చట్టం కింద ఈయన దోషి అని కాన్పూర్ కోర్టు ప్రకటించగానే .. ఉన్నట్టుండి ఆ కోర్టు ఆర్డర్ కాపీతో పారిపోయాడు. ఈ కేసు ఇప్పటిది కాదు. ఎప్పుడో 1991 నాటిది. అక్రమంగా ఆయుధాలను కలిగిఉన్నాడన్న ఆరోపణపై పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. ఇన్నేళ్ళుగా కాన్పూర్ కోర్టులో నలుగుతోంది. శనివారం విచారణకు రాగా.. దీనికి ఈ మంత్రి హాజరయ్యాడు. ఈ కేసులో తను దోషి అని కోర్టు నిర్ధారించి శిక్షను ప్రకటించకముందే రాకేష్ కోర్టు హాలు నుంచి కనిపించకుండా పోయాడు. అసలు ఇందులో పోలీసులు తాజాగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారా అన్న విషయం కూడా తేలలేదు. బెయిల్ బాండ్లు కూడా సమర్పించకుండా ఈయన పరారీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ,తుది తీర్పు కోసం తన కేసు లిస్ట్ లో లేదని మొదట అడ్డంగా వాదించినప్పటికీ ఈయనకు విధించే శిక్షపై జడ్జి ప్రాసిక్యూషన్ న్యాయవాదిని ప్రశ్నిస్తుండగానే.. చేతిలో కోర్టు ఆర్డర్ తో రాకేష్ పరారయ్యాడు. ఈయన వ్యవహారంపై కోర్టులో సుదీర్ఘ వాద, ప్రతివాదనలు జరిగాక చివరకు ఆయనపై ఎఫ్ ఐ ఆర్ పెట్టాలనే కోర్టు నిర్ణయించింది.
రాకేష్ నిర్వాకాన్నికాన్పూర్ కొత్వాలీ పోలీసులు కూడా ధృవీకరించారు. లైసెన్స్ లేని వెపన్ ని కలిగి ఉన్నాడన్న ఆరోపణపై 1991 ఆగస్టు 13 న ఈయనపై పోలీసులు కేసు దాఖలు చేశారు. ఇక తానేమీ పారిపోలేదని, ఏదో అత్యవసర పని మీద బయటకి వెళ్లానని రాకేష్ సచన్ ఆ తరువాత మీడియాకు చెప్పినప్పటికీ.. విపక్షాలు ఈయన రాజీనామాకు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. సరిగ్గా శిక్ష ప్రకటించే సమయంలో కోర్టు నుంచి ఎస్కేప్ అవడం కూడా నేరం కిందకే వస్తుందని, అందువల్ల రాకేష్ రాజీనామా అయినా చేయాలి.. లేదా సీఎం యోగి ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతున్నాయి.
ఈ ఏడాదిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు ఈ మంత్రి బీజేపీలో చేరారు. మొదట సమాజ్ వాదీ పార్టీలో కొన్నేళ్లు ఉన్నా ఆ తరువాత కమలం పార్టీ కండువా కప్పుకున్నాడు. 2009-2014 మధ్య ఫతేపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎంపీగా వ్యవహరించిన సచన్ ఇలా ఎందుకు పారిపోయాడన్నది మిస్టరీగా ఉంది. కాన్పూర్ కోర్టు ఈయనకు ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.