లోక్‌సభ స్పీకర్ పదవి.. టీడీపీ, జేడీయూ పట్టు?
ఇప్పటివరకూ టీడీపీ, జేడీయూకు చెందిన నేతలు దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ, ఇవాళ జరిగే NDA సమావేశంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్రంలో NDA సర్కార్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జేడీయూ, టీడీపీలు కీలకంగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలు లోక్‌సభ స్పీకర్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వం స్పీకర్ పదవిని.. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఇచ్చింది. 1998 - 2002 మధ్య టీడీపీ దివంగత నేత GMC బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జేడీయూ సుప్రీం లీడర్ నితీష్ కుమార్ స్పీకర్ పదవి కోసం డిమాండ్ చేయొచ్చని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ టీడీపీ, జేడీయూకు చెందిన నేతలు దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ, ఇవాళ జరిగే NDA సమావేశంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి జేడీయూ చీఫ్ నితీష్‌కుమార్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు.
లోక్‌సభకు స్పీకర్ అధిపతిగా ఉంటారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు విషయంలో లోక్‌సభ స్పీకర్‌దే తుది నిర్ణయం. ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టుకు కూడా పరిమిత అధికారాలే ఉంటాయి. సాధారణంగా స్పీకర్ పదవి అధికార కూటమికే వెళ్తుంది. 16వ లోక్‌సభ సమయంలో అన్నా డీఎంకేకు చెందిన తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించగా.. 17వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నుకోకుండానే ముగిసింది.